రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. SVCC బ్యానర్‌పై బివియస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు.
ఇటీవల విడుదలైన ‘వృషకర్మ’ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి, ట్రేడ్ వర్గాల నుంచి చక్కటి స్పందన లభించింది. దాంతో ఏరియాల వారీగా ఈ సినిమా రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగవంశీ వేర్వేరు ప్రాంతాల థియేట్రికల్ హక్కుల బిజినెస్‌ను విడివిడిగా క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలో అత్యంత కీలకమైన నైజాం ఏరియా రైట్స్ డీల్‌ను ఇటీవల ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 15 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెడుతున్న రాజుకుంట ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడం విశేషంగా మారింది.
ఈ రూ. 15 కోట్ల డీల్‌లో రూ. 12 కోట్లను ఎన్ ఆర్ ఎ (NRA – Non-Returnable Advance)గా, మిగిలిన రూ. 3 కోట్లను రికవరబుల్ అడ్వాన్స్‌గా ఒప్పందం కుదిరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ప్రాంతంలో నాగచైతన్య సినిమా ఈ స్థాయిలో ధర పలకడం రికార్డ్‌గా భావిస్తున్నారు.
ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం ‘వృషకర్మ’పై ఉన్న అంచనాలు, క్రేజ్‌కు అద్దం పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాగవంశీ పక్కా ప్లానింగ్‌తో థియేట్రికల్ రైట్స్‌ను వేర్వేరు ఏరియాలకు రీజనల్ వైజ్‌గా విక్రయిస్తున్నాడు. నైజాం వ్యాపారం ఇంత భారీ స్థాయిలో ముగియడంతో, త్వరలోనే మిగిలిన ఆంధ్ర, సీడెడ్ ఏరియాల డీల్స్ కూడా రికార్డు రేట్లకు క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.







