రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
వీకెండ్‌కి ఓటీటీల్లో వినోదాలు
వీకెండ్ వచ్చిందంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఓటీటీ వేదికలు. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం మంచి వినోదం సిద్ధమైంది. సస్పెన్స్‌తో ఉత్కంఠపరిచే థ్రిల్లర్లు, మనసును హత్తుకునే ఫీల్ గుడ్ డ్రామాలు, నవ్వులు పంచే రొమాంటిక్ కామెడీలు, స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎంటర్టైనర్లు ఇలా ప్రతి అభిరుచికి తగ్గ సినిమాలు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా జూలై 31న వరుసగా నాలుగు సినిమాలు విడుదలవుతుండగా, ఇప్పటికే జూలై 28 నుంచే ఒక ఆసక్తికరమైన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను అలరిస్తోంది.
‘బాలన్: ది బాయ్’ – ZEE5లో సైకలాజికల్ థ్రిల్లర్
ZEE5లో జూలై 31న స్ట్రీమింగ్కు రానున్న ‘బాలన్: ది బాయ్’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. ఆదిశేషన్ KR, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టోవినో థామస్ (అతిథి పాత్ర) నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. మహిళల సంరక్షణ కేంద్రంలో ఉండే తల్లి దగ్గర పెరిగిన బాలన్ జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత వేర్వేరు గుర్తింపులతో జీవించడం, అదే సమయంలో తల్లి కనిపించకపోవడంతో ఆమె కోసం బాలన్ సాగించే అన్వేషణ, ఈ క్రమంలో వెలుగులోకి వచ్చే రహస్యాలు సస్పెన్స్‌తో కథను ముందుకు నడిపిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ చిత్రం మంచి ఎంపికగా నిలవనుంది.
‘చిన్న చిన్న ఆసై’ – Jio Hotstarలో ఫీల్ గుడ్ డ్రామా
Jio Hotstarలో జూలై 28 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’ ఒక ఫీల్ గుడ్ మూవీ. ఇంద్రన్స్, మధు షా, అపర్ణ బాలమురళి, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. తంజావూరు యువతి లీల వారణాసిలో చిక్కుకుపోయి, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు మాధవన్‌తో కలిసి గడిపిన ఒక రోజు చుట్టూ కథ నడుస్తుంది. గతాలు, భయాలు, కలలు పంచుకుంటూ ఇద్దరి మధ్య ఏర్పడే అనూహ్య బంధం కథను హృదయాన్ని తాకేలా చేస్తుందని చిత్ర బృందం పేర్కొంటోంది.
‘గట్టా కుస్తీ 2’ – Netflixలో ఫ్యామిలీ స్పోర్ట్స్ ఎంటర్టైనర్
తమిళ స్పోర్ట్స్ యాక్షన్ కామెడీ ‘గట్టా కుస్తీ 2’ జూలై 31 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. చెల్ల అయ్యవు దర్శకత్వం వహించిన ఈ మలయాళ్ డబ్ మూవీలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, యోగిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. మొదటి భాగం తర్వాత వీర్, కీర్తి దాంపత్య జీవితం ఎలా సాగింది, కుటుంబ బాధ్యతలు, రెజ్లింగ్ కెరీర్ మధ్య వారు ఎలా ముందుకు సాగారు అనే అంశాలను వినోదాత్మకంగా చూపించారు. కుటుంబంతో కలిసి చూడదగిన ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలవొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
‘పైతలాట్టం’ – SunNXTలో మిస్టరీ థ్రిల్లర్
మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకుల కోసం SunNXTలో జూలై 31 నుంచి ‘పైతలాట్టం’ స్ట్రీమింగ్ కానుంది. ధన్య, జయన్ చేరాల్, సునీల్ సుగడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విబిన్ ఎన్. వేలాయుధన్ దర్శకత్వం వహించారు. పల్లెటూరి కుటుంబ విభేదాలు, ‘తీ చాముండి తెయ్యం’ ఆచారం, గతంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే విధంగా కథ సాగుతుంది. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే ప్రయత్నం చేసినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.
‘లవ్ ఓ లవ్’ – Prime Videoలో రొమాంటిక్ కామెడీ
తమిళ రొమాంటిక్ కామెడీ ‘లవ్ ఓ లవ్’ జూలై 31 నుంచి Prime Videoలో అందుబాటులోకి రానుంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలంగాణ జానపద గీతాలతో గుర్తింపు పొందిన నాగదుర్గ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో కేవలం మూడు వారాల్లోనే ఓటీటీ బాట పట్టింది. మాగేష్ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని సంతోషంగా ఉంచేందుకు అప్పులు చేసి, ఉద్యోగం కోల్పోయిన యువకుడి జీవితాన్ని సరదాగా చూపించారు. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించే లైనప్ సిద్ధమైంది. సస్పెన్స్ కోసం ‘బాలన్: ది బాయ్’, రొమాంటిక్ కామెడీ కోసం ‘లవ్ ఓ లవ్’, మనసును హత్తుకునే కథ కోసం ‘చిన్న చిన్న ఆసై’, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ‘గట్టా కుస్తీ 2’, థ్రిల్లింగ్ కోసం ‘పైతలాట్టం’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీకెండ్‌కి నచ్చిన సినిమాను ఓటీటీలో ఎంచుకుని ఇంట్లోనే ఆస్వాదించేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.







