ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘టాక్సిక్’..

‘ కెజిఫ్ ’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్ ’ విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో ముందుకు వస్తుండగా, ఇప్పుడు ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో మరో ప్రత్యేక గుర్తింపును అందుకుంది.

IMDb ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ‘టాక్సిక్ ’ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా మొదటి స్థానంలో నిలవడం విశేషంగా మారింది. సెర్చ్ ట్రెండ్స్ వంటి పలు ప్రమాణాల ఆధారంగా ఈ జాబితా రూపొందుతుండటంతో, విడుదలకు ముందే ఈ స్థాయి గుర్తింపు రావడం చిత్రబృందానికి పెద్ద ఊరటనిచ్చిన అంశంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. యష్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. విడుదల తేదీ పలుమార్లు మారినప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు.

ఇటీవల విడుదలైన ‘ లేడీస్ అండ్ లేడీస్ ’ టీజర్‌కు, ‘టాబాహి’ పాటకు ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందన సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఈ ప్రమోషనల్ కంటెంట్‌కు లభిస్తున్న భారీ స్పందన, ‘టాక్సిక్ ’పై దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.

IMDb జాబితాలో అగ్రస్థానంలో నిలవడంతో, ఆగస్టు 26న జరగబోయే విడుదలకు ముందు సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెర్చ్ ట్రెండ్స్ ఆధారంగా రూపొందే ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకోవడం, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి స్థాయిని ప్రతిబింబిస్తున్నదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యష్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ క్యాస్టింగ్, గీతూ మోహన్ దాస్ ప్రత్యేక మేకింగ్ శైలి కలిసి ‘టాక్సిక్ ’ను ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న‘టాక్సిక్ ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని యష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.