హైదరాబాద్‌ అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కల్తీ ఆహార తయారీ కేంద్రం బహిర్గతమైంది. ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నడుస్తున్న ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో భారీ స్థాయిలో పానీపూరీలు, సమోసాలు తయారు చేసి నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.

ఆహార భద్రతా విభాగానికి వచ్చిన సమాచారం ఆధారంగా HFast ఫుడ్ సేఫ్టీ బృందం సోమవారం రాత్రి ఈ కేంద్రంపై దాడి చేసింది. తనిఖీల్లో భాగంగా ఆహార భద్రతా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ లేకుండానే ఆహార తయారీ, విక్రయ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు బయటపడింది.

వంటగదిలో అపరిశుభ్రత, ఈగల బెడద, శుభ్రత లోపాలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ఓపెన్ డ్రైనేజీ పక్కనే పానీపూరీ పూరీలు, సమోసాల కోసం పిండిని కలపడం, పూరణ తయారీ వంటి పనులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్‌ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా బయటపడ్డాయి.

ప్రజలు తినే ఆహారాన్ని కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వాడి నల్లగా మారిన వంటనూనెను మళ్లీ మళ్లీ వేయింపుల కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని ఆహార భద్రతా సిబ్బంది తెలిపారు.

తక్షణ చర్యల భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 3 వేల పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంటనూనెను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే అక్కడి నుంచి పానీపూరీ నీరు, పూరీలు, సమోసాల పూరణ, వంటనూనె తదితర ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపించారు.

నిబంధనలు పాటించకుండా, లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఆ ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కార్యకలాపాలను అధికారులు వెంటనే నిలిపివేసి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి ఆహార వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది.

బయట ఆహారం తినే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీధి బండ్లలో తినే ముందు ఆహార తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులు కూడా ఆహార నాణ్యతపై జాగ్రత్త వహించి, అనుమానాస్పద కేంద్రాల గురించి ఫుడ్ సేఫ్టీ విభాగానికి సమాచారం అందించాలని కోరుతున్నారు.