వర్షాకాలం మొదలవగానే చాలా మందికి కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్లు, మణికట్టులు, భుజాలు, నడుము భాగాల్లో నొప్పి, బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ నొప్పులు కాలానికీ, వాతావరణ మార్పులకీ ఉన్న సంబంధం గురించి వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం పెరుగుతుంది. ఈ అధిక తేమ ప్రభావంతో కీళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి స్వల్ప వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో కీళ్లను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికే కీళ్ల సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండాకాలం తర్వాత ఒక్కసారిగా వర్షాలు పడటంతో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ అకస్మాత్తు మార్పు కారణంగా కీళ్లలో ఉండే సహజ లూబ్రికేషన్ కొంత తగ్గి, కీళ్లు బిగుసుకుపోయినట్లు, గట్టిగా ఉన్నట్లు అనిపించవచ్చు. అలాగే వర్షాకాలంలో వాతావరణ పీడనం తగ్గడం కూడా కీళ్ల నొప్పులకు కారణంగా భావిస్తున్నారు. బారోమెట్రిక్ ప్రెషర్ తగ్గిపోవడంతో కీళ్ల చుట్టూ ఉన్న కణజాలంలో స్వల్ప వాపు ఏర్పడి, నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వర్షాల కారణంగా చాలా మంది బయటకు వెళ్లి నడక, జాగింగ్, వ్యాయామం చేయడం తగ్గిస్తారు. ఈ శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. కీళ్లకు సరైన కదలిక లేకపోవడం వల్ల బిగుతు, నొప్పి మరింత పెరుగుతుంది. అందుకే వర్షాలు పడుతున్నా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్, యోగా లేదా నడక చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శరీర బరువును నియంత్రణలో ఉంచడం ద్వారా కీళ్లపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

కీళ్ల ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం సరిగా ఉంటే కీళ్ల కదలికలు సులభంగా ఉంటాయి. ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు నిల్వ ఉండి వాపు పెరిగే అవకాశం ఉండటంతో, ఉప్పు వినియోగాన్ని పరిమితంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో అవిసె గింజలు, చియా సీడ్స్, బ్రోకోలీ వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చడం ద్వారా కీళ్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి వాపును తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంలో ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ పదార్థాలను ఉపయోగించే ముందు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

వర్షాకాలంలో స్వల్ప కీళ్ల నొప్పులు సాధారణంగా కనిపించినప్పటికీ, నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే లేదా వాపు, ఎర్రబడటం, కదలికలో తీవ్ర ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్, గౌట్ లేదా ఇతర కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు, వ్యాయామం, సరైన ఆహారం ద్వారా సమస్యను నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. కీళ్ల నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే లేదా తీవ్రమైతే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.