మెడ, నడుము, వెన్ను నొప్పి, బిగుతు, చేతులు–కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి పాకడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి సాధారణ అలసటగా భావించి వదిలేయడం ప్రమాదకరం. వెన్నెముక, కండరాలు, నరాలకు సంబంధించిన లోతైన సమస్యలకు ఇవి సంకేతాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రోజువారీ పనుల్లో ఎక్కువసేపు కూర్చోవడం, మొబైల్‌–ల్యాప్‌టాప్‌లను వంగి చూడడం, బరువులు ఎత్తడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల మెడ, నడుము, వెన్ను ప్రాంతాల్లో నొప్పి, బిగుతు సాధారణంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఇవి తాత్కాలిక నొప్పులేనని భావించి నొప్పి తగ్గించే మాత్రలు వేసుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అదే పనుల్లో నిమగ్నమైపోతున్నారు. కానీ ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మెడ, నడుము లేదా వెన్ను నొప్పికి ఒక్క కారణమే ఉండాల్సిన అవసరం లేదు. కండరాల గాయాలు, కండరాలు బిగుసుకుపోవడం, వెన్నెముక ఎముకలలో వయస్సు కారణంగా వచ్చే మార్పులు, డిస్క్‌ బల్జ్‌ లేదా హెర్నియేషన్‌, నరాలపై ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఈ నొప్పులు రావచ్చు. కొన్నిసార్లు నొప్పి స్థానికంగా ఉండకుండా చేతులు, కాళ్లు, భుజాలు, తొడల వరకు పాకుతుంది. తిమ్మిర్లు, మొద్దుబారినట్టు అనిపించడం, బలహీనత, నడవడంలో అసౌకర్యం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

కండరాల సమస్యల వల్ల వచ్చే నొప్పి సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోవచ్చు. అయితే వెన్నెముకలో డిస్క్‌ బల్జ్‌ లేదా హెర్నియేషన్‌ జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. డిస్క్‌ బయటకు ఉబ్బి నరాలపై ఒత్తిడి పెంచితే చేతులు–కాళ్లలోకి నొప్పి పాకడం, తిమ్మిర్లు, గుచ్చినట్టు అనిపించడం, బలం తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దశలో సరైన వైద్య పరీక్షలు, చికిత్స అవసరం. ఆలస్యం చేస్తే నరాలపై ఒత్తిడి ఎక్కువై, శాశ్వత నష్టం కలగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మెడ, నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం, సరైన భంగిమలో కూర్చోవడం, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు పాటించడం, రోజూ తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్‌ చేయడం వంటి అలవాట్లు నొప్పి తగ్గించడంలో, కొత్త సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడతాయి. నొప్పి కొన్ని రోజులకు మించి కొనసాగితే, రాత్రివేళల ఎక్కువైతే, చేతులు–కాళ్లలో బలహీనత, తిమ్మిర్లు, మూత్రం–మలం నియంత్రణలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణుడిని సంప్రదించడం అవసరం.

వైద్యులు సూచనల ప్రకారం ఫిజియోథెరపీ, మందులు, జీవనశైలి మార్పులు, అవసరమైతే ఇతర చికిత్సా విధానాలు ద్వారా మెడ, నడుము, వెన్ను నొప్పిని నియంత్రించవచ్చు. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే చాలా మంది కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే మెడ–నడుము నొప్పిని చిన్న సమస్యగా తీసుకోకుండా, శరీరం ఇస్తున్న సంకేతాలను గమనించి, సమయానికి వైద్య సలహా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి.