రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: ఈక్వెడార్‌లోని ఓ చర్చిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో క్యాథలిక్ ప్రీస్ట్ ప్రాణాలు కోల్పోయారు. చర్చిలో ప్రసంగం చేస్తుండగా వెనుక గోడకు అమర్చిన భారీ చెక్క సిలువ అకస్మాత్తుగా కూలిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సిలువ నేరుగా ప్రీస్ట్ తలపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక సమాచారం.
వివరాల్లోకి వెళ్తే, చర్చిలో నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో క్యాథలిక్ ప్రీస్ట్ పాట్రిసియో భక్తులకు స్పీచ్ ఇస్తున్నారు. ఈ సమయంలో ఆయన వెనుక గోడకు అమర్చిన పెద్ద చెక్క సిలువ ఒక్కసారిగా ఊడిపడి నేరుగా ఆయనపై పడింది. బరువైన సిలువ కింద నలిగిన పాట్రిసియోకు తీవ్ర గాయాలు కాగా, సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు అక్కడున్న వారు తెలిపారు.

ఘటనను గమనించిన చర్చిలోని సిబ్బంది, భక్తులు వెంటనే ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినా అప్పటికే ప్రీస్ట్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో చర్చిలో ఉన్న భక్తులు షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చర్చిలో ప్రసంగం జరుగుతున్న సమయంలోనే సిలువ కూలిపడిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రీస్ట్ కుటుంబానికి, చర్చి సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.
చర్చిలో గోడకు అమర్చిన సిలువ ఎలా కూలిపోయింది, దానికి కారణం ఏమిటనే అంశంపై స్థానిక అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. చర్చిల్లో భారీ అలంకరణలు, నిర్మాణాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

పాట్రిసియో మృతితో స్థానిక క్రైస్తవ సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ భక్తులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. చర్చిలో జరిగిన ఈ దుర్ఘటనపై పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.






