రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: ప్యారిస్: ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యార్థుల ఉద్యమం దేశాన్ని వణికిస్తోంది. జెన్ ఆల్ఫా తరం ఆగ్రహం ముందు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఒక్క లీసే పాఠశాలలో మొదలైన నిరసన, కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించి మహోద్యమంగా మారింది. ప్రభుత్వాన్ని కదిలిస్తున్న ఈ ఉద్యమకారులంతా 15–18 ఏళ్లలోపు విద్యార్థులే. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా వేదికలను ప్రధాన ప్రచార సాధనాలుగా చేసుకొని దేశం నలుమూలలా వీధుల్లోకి దిగుతున్నారు.
పాఠశాలల్లో సౌకర్యాల కొరత, టీచర్ల లోపం, విద్యారంగంపై ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక పొదుపు చర్యలే ఈ ఉద్యమానికి కారణమని విద్యార్థులు చెబుతున్నారు. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 6 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 87 శాతం మంది పాఠశాల విద్యార్థులేనని ప్రభుత్వమే ప్రకటించింది.
ఫ్రాన్స్‌లో పాఠశాల విద్యను పలు స్థాయిలుగా విభజించారు. 3–6 ఏళ్ల పిల్లలకు ఎకోల్ మాటెర్నెల్, 1–5 తరగతులకు ఎకోల్ ఎలిమెంటైర్, 6–9 తరగతులకు కాలేజ్, 10–12 తరగతులకు లీసే పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఉద్యమంలో పాల్గొంటున్నవారు ఈ లీసే స్థాయి విద్యార్థులే. దేశంలో సుమారు 3,700 లీసే పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం పాత భవనాల్లో, తక్కువ సౌకర్యాలతో నడుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ధనికుల పిల్లలు చదివే కొన్ని పాఠశాలల్లో మాత్రమే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కో క్లాసులో 32–35 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా, ప్రభుత్వం ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా టీచర్ల మూలవేతనాల్లో కోత విధించాలని నిర్ణయించటం విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రగిలించింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్యారిస్ సమీపంలోని సెయింట్ ఎక్సుపెరీ లీసే పాఠశాలలో గత నెల 21న టీచర్లు ధర్నాకు దిగారు. ఆ స్కూల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉండటంతో కొత్త టీచర్లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. వారికి విద్యార్థులు కూడా జతకలవటంతో ఆ పాఠశాల మూతపడింది. స్పందించిన అధికారులు కొత్త టీచర్లను పంపి సమస్యను పరిష్కరించినట్లు భావించారు. అయితే మరుసటి రోజు నుంచే ఇతర ప్రాంతాల లీసే పాఠశాలల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి రావడం ప్రారంభించారు. ఈ నిరసనలు అత్యంత వేగంగా దేశమంతా వ్యాపించాయి.
పాఠశాలల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని, కొత్త టీచర్లను నియమించాలని, సెలవుల్లో ఉన్న టీచర్ల స్థానంలో ప్రత్యామ్నాయులను పంపించాలని డిమాండ్ చేస్తూ వేలమంది విద్యార్థులు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదట పోలీసులు నిరసనలను తేలికగా తీసుకొని విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అణచివేతకు దిగారు. విద్యార్థులపై భాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. వందల ప్రదేశాల్లో లాఠీచార్జీలు జరిపారు. దొరికిన వారిని విచక్షణ లేకుండా అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పాఠశాలలకు నిప్పు పెట్టారు. స్కూళ్లను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించిన పలువురు ప్రిన్సిపాళ్లపై దాడులు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 పాఠశాలలు అగ్నికి ఆహుతయ్యాయి. మార్సీవిల్లే ప్రాంతంలో విధ్వంసం అధికంగా నమోదైంది.
మంగళవారం దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 488 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల గ్రెనేడ్ పేలిన ఘటనలో ఓ విద్యార్థి చెయ్యి కోల్పోయాడు. నిరసనల కారణంగా ఇప్పటివరకు 215 మంది విద్యార్థులు, 85 మంది పాఠశాల సిబ్బంది, పోలీసులూ గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ విద్యార్థుల ఉద్యమానికి మొదట ప్రత్యేక నాయకత్వం లేకపోయినా, క్రమంగా వామపక్ష శక్తులు మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొంటున్నాయి. Union Syndicale Lycéenne వంటి విద్యార్థి సంఘాలు ఉద్యమంలోకి ప్రవేశించాయి. తాజాగా కార్మిక సంఘాలు, రైతులు కూడా విద్యార్థుల వెంట నడుస్తున్నారు. పోలీసుల దాడుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. La France Insoumise అనే వామపక్ష పార్టీ విద్యార్థులకు రక్షణగా నిలవాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
ఇదే సమయంలో మితవాద National Rally నేత Marine Le Pen, ఇలాంటి నిరసనల్లో పాల్గొనటాన్ని నేరంగా పరిగణించే కొత్త చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రవేశించటం ప్రభుత్వానికి కూడా అవకాశంగా మారింది. ఇది విద్యార్థుల ఉద్యమం కాదని, ప్రతిపక్ష పార్టీల రాజకీయ కుట్ర అని ప్రధాని Sébastien Lecornu ఆరోపిస్తున్నారు.
‘తీవ్రమైన హింస మన పాఠశాలల గుమ్మాల వరకు చేరుకుంది. ఈ హింసను దేశంలోని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి’
అని ఆయన మంగళవారం National Assemblyలో పేర్కొన్నారు. అదే సమయంలో అణచివేత నుంచి కొంత వెనక్కు తగ్గుతూ, అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల డిమాండ్లను సావధానంగా వినాలని సూచించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్–మేలో ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అన్ని పార్టీలు విద్యార్థుల ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump కూడా ఈ ఉద్యమాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు ప్రయత్నించారు.
‘ఇది స్కూళ్లకోసం కాదు. ఒకప్పటి గొప్ప దేశాన్ని ఆక్రమించుకొనేందుకు Islam మతం చేస్తున్న ప్రయత్నం’
అని ఆయన మంగళవారం Truth Socialలో పేర్కొన్నారు. వచ్చే నెల 3న అమెరికాలో Midterm ఎన్నికలు ఉండటంతో, అక్కడి ఓటర్లలో చీలిక తెచ్చేందుకే Trump ఈ ఉద్యమాన్ని బూచిగా చూపుతున్నారని అమెరికా మీడియా వ్యాఖ్యానిస్తోంది.
విద్యార్థుల ఉద్యమానికి ప్రధాన కారణాలుగా పాఠశాలల్లో సౌకర్యాల కొరత, వేడి–చలికి తట్టుకునే పరిస్థితులు లేకపోవడం, టీచర్ల తీవ్ర కొరత, ఉన్నవారిలో చాలామంది సెలవుల్లో ఉండటం, క్లాసురూముల్లో పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెట్టడం, లీసే స్థాయి నుంచి యూనివర్సిటీకి వెళ్లేందుకు అవసరమైన Parcoursup వెబ్సైట్ లోపాలతో విద్యార్థులు ఇబ్బందులు పడటం, విద్యారంగానికి నిధుల కోత పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం, టీచర్ల వేతనాల్లో కోత విధించబోతున్నారనే వార్తలు అగ్నికి ఆజ్యం పోశాయని విశ్లేషకులు చెబుతున్నారు.







