రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: హర్మూజ్ జలసంధిలో మునిగిపోయిన కార్గో నౌక నుంచి ఐఫోన్లు, లగ్జరీ పర్ఫ్యూమ్ సీసాలు సముద్రంపై కుప్పలుగా తేలియాడుతున్న దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఈ జలసంధిలో సీమైన్‌ను ఢీకొనడంతో యూఏఈకి చెందిన కార్గో నౌక ప్రమాదానికి గురైన విషయం తెలిసినదే.
ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ నౌక పేరు GFS Pride. దుబాయ్ నుంచి భారీ పరిమాణంలో ఐఫోన్లు, లగ్జరీ పర్ఫ్యూమ్ సీసాలు సహా ఇతర సరుకులను తీసుకువస్తున్న ఈ నౌక బుధవారం సీమైన్‌ను తాకిన తర్వాత మంటలు చెలరేగి చివరకు మునిగిపోయింది.
ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 21 మంది సిబ్బందిని రక్షణ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే నౌకలో ఉన్న సరుకు మొత్తం సముద్రంలోకి చేరి, అందులో భాగమైన ఐఫోన్లు, పర్ఫ్యూమ్ సీసాలు నీటిమీద తేలియాడుతున్నాయి.
ఈ దృశ్యాలు గమనించిన స్థానికులు, మత్స్యకారులు చిన్న పడవల్లో అక్కడికి చేరుకుని తేలియాడుతున్న సరకులను సేకరించుకుంటూ కనిపించారు. సముద్ర అలలతో ఒక చోట కేంద్రీకృతమవుతున్న కార్టన్లు, బాక్స్‌లు, సీసాలను వీరు పడవల్లోకి ఎక్కించుకుంటూ వెళ్లిపోతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక మార్గం కావడంతో ఇక్కడ జరిగే ప్రతి సముద్ర ప్రమాదం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, భారీ పరిమాణంలో విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు సముద్రంలో కలిసిపోవడం ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది.
ప్రమాదానికి గల కారణాలు, సీమైన్‌ను అక్కడ ఎలా ఏర్పాటుచేశారన్న అంశాలపై సంబంధిత దేశాల సముద్ర రవాణా అధికారులు విచారణ ప్రారంభించినట్లు విదేశీ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నౌక మిగిలిన భాగాలను, సముద్రంలో తేలియాడుతున్న సరకులను ఎలా నిర్వహించాలన్న దానిపై కూడా అధికారులు సమీక్ష జరుపుతున్నారు.






