రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: టెహ్రాన్ : హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించే విషయంలో తమ షరతులు నెరవేరే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘలిబాఫ్ ఆదివారం వెల్లడించారు. ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఇకపై కాలయాపన చేయడానికి వీలు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఘలిబాఫ్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక మధ్యవర్తి ద్వారా అమెరికా కొన్ని ప్రతిపాదనలు ఇరాన్‌కు పంపిందని చెప్పారు. అమెరికా ఇప్పటికీ కాలం గడిపే ధోరణి, ఏకపక్ష డిమాండ్లను ఇతర దేశాలపై రుద్దే ప్రయత్నం కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు.
‘‘ఇలా కాలయాపన చేస్తూ, ఏకపక్ష డిమాండ్లను ఇతర మీద రుద్దే శకం ముగిసిందని అమెరికా తెలుసుకోవాలి’’
అని ఘలిబాఫ్ పేర్కొన్నారు. ఇరాన్ వైఖరి స్పష్టంగా, నిశ్చయంగా ఉందని ఆయన అన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులు నెరవేరే వరకు హర్మూజ్ జలసంధి తెరుచుకునే ప్రశ్నే లేదని ఘలిబాఫ్ హెచ్చరించారు.
ఇరాన్ ఇప్పటికే యుద్ధరంగంలో ఉందని, కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. అమెరికా నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలపై ఇరాన్‌కు ఉత్సాహం గానీ, భయం గానీ లేవని ఘలిబాఫ్ తెలిపారు. పోరాటం, చర్చలు రెండింటినీ సమాంతరంగా కొనసాగించే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో సమావేశంలో ఇరాన్ ధోరణిని వివరించారు.
‘‘మమ్మల్ని మేము రక్షించుకోవడంలో ఎంత నిబద్ధతతో ఉన్నామో, దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనడంలో కూడా ఇరాన్ అంతే నిబద్ధతతో ఉంది’’
అని అరాఘ్చి అన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన తమ షరతులను అమెరికాకు స్పష్టంగా తెలియజేశామని ఆయన తెలిపారు. అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరిస్తుందని ఇరాన్ ఆశిస్తున్నదని అరాఘ్చి పేర్కొన్నారు.
అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు ఆయన కఠిన హెచ్చరిక జారీ చేశారు.
ఇరాన్ ‘‘గతంలో కంటే మరింత సిద్ధంగా ఉందని, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఎలాంటి చర్య అయినా తీసుకుంటుందని’’
అని అరాఘ్చి స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి తిరిగి ప్రారంభం, ప్రాంతీయ భద్రత, అమెరికా–ఇరాన్ సంబంధాలపై ఈ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.







