ఇటలీ పాఠశాలల్లో బురఖా, నికాబ్ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పే దుస్తులపై నిషేధం విధించే దిశగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక ప్రకటన చేశారు. సంప్రదాయం పేరుతో బాలికలు, యువతులు తమ ముఖాలను కప్పుకోవాలని ఎవరూ బలవంతం చేయలేరని ఆమె స్పష్టం చేశారు.

ఈ అంశంపై త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మెలోని వెల్లడించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తమ ముఖం స్పష్టంగా కనిపించేలా మాత్రమే హాజరుకావాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో వలసలు, మతపరమైన ఆచారాల నేపథ్యంలో విద్యాసంస్థల్లో స్పష్టమైన నియమాలు అవసరమని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ఇటలీలో చదువుతున్న విదేశీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇటాలియన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మెలోని తెలిపారు. ఇటాలియన్ విద్యావ్యవస్థలో కలవడానికి ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇటాలియన్ భాష నేర్చుకోవాలని కొత్త నిబంధన తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై కూడా పరిమితులు విధించే ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు మెలోని చెప్పారు. ఆదివారం తన పార్టీ Brothers of Italy యువజన విభాగం వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు చట్టబద్ధమైన గరిష్ఠ పరిమితి ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

సమైక్యతే లక్ష్యమని ఇటలీ సర్కార్ స్పష్టం

తరగతి గదిలో ఇటాలియన్ భాష రాని విదేశీ విద్యార్థి ఒక్కరే ఉంటే, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సాయంతో సులభంగా భాష నేర్చుకుని మిగతా వారితో కలిసిపోగలరని మెలోని అభిప్రాయపడ్డారు. అయితే భాష రానివారు ఎక్కువ సంఖ్యలో ఉంటే, ఇటాలియన్ విద్యార్థులతో వారు కలవడం కష్టమవుతుందని, అలాంటి పరిస్థితి ఆమోదయోగ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇటలీ పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల శాతం 11.6గా ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ శాతాన్ని ఎంతవరకు తగ్గిస్తారనేది మెలోని స్పష్టంగా చెప్పలేదు. అయితే పాత చట్టాల ప్రకారం ఒక్కో తరగతిలో 30 శాతం వరకు మాత్రమే విదేశీ విద్యార్థులను అనుమతించే నిబంధన అమల్లో ఉంది. దాన్ని మరింత తగ్గించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొత్త చట్టం ముఖాన్ని పూర్తిగా కప్పే బురఖా, నికాబ్‌లకే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కళ్లు సహా ముఖం స్పష్టంగా కనిపించేలా ఉండే హిజాబ్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని సమాచారం. ఈ చర్యల ద్వారా దేశంలో వలసదారుల ఏకీకరణను బలోపేతం చేయాలని ఇటలీ సర్కార్ సంకేతాలు ఇస్తోంది.

త్వరలోనే ఈ కీలక చట్టాలను క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు మెలోని అధికారికంగా ప్రకటించారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, సమైక్యత, భాషా ఏకీకరణ లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.