రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు వెళ్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం గాల్లో ఉండగానే ప్రమాదానికి గురైనట్లు అక్కడి ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా మృతి చెందినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
అధికారుల ప్రాథమిక వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానంలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉండగా.. మొత్తం 32 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలిసింది. విమానం ప్రయాణమధ్యలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉన్న కమ్యూనికేషన్ ఒక్కసారిగా నిలిచిపోయినట్లు సమాచారం.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిన కొద్దిసేపటికే రాడార్‌పై నుంచి కూడా ఆ విమానం సిగ్నల్ అదృశ్యమైంది. సిగ్నల్ కట్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్లు అక్కడి వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల నుంచి పొగలు, మంటలు కనిపించడంతో స్థానికులు సమాచారం అందించగా, రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం టెక్నికల్ లోపం, వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం వంటి కోణాల్లో విచారణ జరపనున్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని ముట్టడి చేసి, శకలాలను సేకరించి, బ్లాక్ బాక్స్‌ను గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.
ఈ ఘటనతో నైజీరియా ఎయిర్‌ఫోర్స్‌లో ఆందోళన నెలకొంది. ప్రమాదంపై పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు పూర్తయ్యాకే ప్రమాదానికి గల నిజమైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.







