రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
రెండు హెలికాప్టర్లు ఢీ;
అమెరికన్ సింగర్ ఒలివర్ ట్రీతో పాటు ఆరుగురు మృతి
బ్రెజిల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. రియో డి జెనిరో గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ అమెరికన్ సింగర్, సంగీతకారుడు ఒలివర్ ట్రీ కూడా ఉన్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన ఆదివారం జరిగింది.
రియో డి జెనిరో నగరానికి పశ్చిమ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. గగనతలంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు నగర పరిసర ప్రాంతాల్లో కూలిపోయాయి. అందులో ఒక హెలికాప్టర్ స్థానిక కార్ డీలర్షిప్ పార్కింగ్ ప్రాంతంలో పడిపోయింది. అక్కడ పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్నాయని, వాటిని అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.
ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్లలో ఉన్న ఆరుగురి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. విమానయాన అధికారులకు అందజేసిన ప్రయాణికుల జాబితా ఆధారంగా మృతుల వివరాలను గుర్తించారు. వారిలో అమెరికన్ సింగర్ ఒలివర్ ట్రీతో పాటు ఓ సంగీతకారుడు, అర్జెంటీనా వీడియో డైరెక్టర్, అర్జెంటీనా యూట్యూబర్ ఉన్నట్లు సమాచారం.
32 ఏళ్ల ఒలివర్ ట్రీ ప్రస్తుతం వరల్డ్ టూర్లో భాగంగా బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. తన విభిన్నమైన హెయిర్‌స్టైల్, ప్రత్యేక శైలితో యువతలో విశేష ఆదరణను సంపాదించుకున్నారు. స్పాటిఫై వేదికపై ఆయన పాటలకు నెలకు సుమారు 11 మిలియన్ల మంది శ్రోతలు ఉన్నట్లు సంగీత వర్గాలు చెబుతున్నాయి.
వరల్డ్ టూర్లో భాగంగా ఒలివర్ ట్రీ 30 దేశాల్లో 70 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా, ఈ పర్యటన మధ్యలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై బ్రెజిల్ విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హెలికాప్టర్లు ఢీకొనడానికి దారి తీసిన సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితులా, లేక మానవ తప్పిదమా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ఘటన స్థలంలో రక్షణ చర్యలు పూర్తి చేసిన అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అంతర్జాతీయ సంగీత ప్రపంచాన్ని కుదిపేసిన ఈ ప్రమాదంపై అభిమానులు, సంగీత కళాకారులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.







