రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
రియాద్ కింగ్ ఖలీద్ విమానాశ్రయంపై వరుస దాడులు: భారతీయులపై ముప్పు, హైదరాబాద్ ఐటీ నిపుణుడు మృతి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. ఆదివారం మరోసారి క్షిపణి దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఇది ఆ విమానాశ్రయంపై జరిగిన మూడో దాడి అని సౌదీ అధికారులు వెల్లడించారు.
ఆదివారం జరిగిన తాజా దాడిలో ప్రయాణికుల టెర్మినల్‌ను క్షిపణి ఢీకొట్టినట్లు సమాచారం. అయితే ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాన్ని మూసివేయడంతో ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో శనివారం జరిగిన క్షిపణి దాడి తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేస్తామని హౌతీలు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను ఆదివారం రాత్రి 9 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని రియాద్‌లోని పాఠశాలల్లో కనీసం వారం రోజులపాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
శనివారం దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే మూడో, నాలుగో టెర్మినళ్లపై దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు సౌదీ పౌరులు సహా పలువురు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారత్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్, బంగ్లాదేశ్, పాలస్తీనాకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఇదే విమానాశ్రయంపై జరిగిన మరో దాడిలో ముగ్గురు మరణించిన విషయం ఇప్పటికే తెలిసినదే. వరుస దాడులతో సౌదీ గగనతల రక్షణ సామర్థ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సౌదీ అరేబియాలో గగనతల రక్షణ వ్యవస్థలకు కొరత ఏర్పడినట్లు సమాచారం. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వద్ద కూడా ఈ వ్యవస్థలు తగినన్ని లేకపోవడంతో సౌదీ ప్రభుత్వం ఫ్రాన్స్ , బ్రిటన్ , ఈజిప్ట్ లను అదనపు రక్షణ వ్యవస్థలు సరఫరా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా ఆదివారం యెమెన్ రాజధాని Sanaపై జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు మరణించినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. రియాద్ విమానాశ్రయంపై హౌతీలు వరుసగా దాడులు చేయడాన్ని భారత్ ఖండించింది.
హైదరాబాద్ ఐటీ నిపుణుడు మహమ్మద్ యూసుఫ్ మృతి
రియాద్ విమానాశ్రయంపై శనివారం జరిగిన క్షిపణి దాడిలో హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన ఐటీ నిపుణుడు మహమ్మద్ యూసుఫ్ (46) ప్రాణాలు కోల్పోయారు. ఉమ్రా యాత్ర కోసం మాడిన వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రియాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం జరిగిన దాడిలో యూసుఫ్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటనలో ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె గాయపడ్డారు. వీరిని రియాద్‌లోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. యూసుఫ్ కుమారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.






