రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: జపాన్‌లో నిద్రలేమి సమస్యపై అవగాహన పెంచేందుకు ఓ వినూత్న పోటీ నిర్వహించారు. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమాన్ని "కోలా స్లీప్ జపాన్" అనే సంస్థ ప్రత్యేకంగా రూపకల్పన చేసింది. "మ్యాట్ రేస్" పేరుతో నిర్వహించిన ఈ స్లీప్ కాంపిటీషన్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది.
నిద్రలేమితో బాధపడుతున్న వారికి సరైన నిద్ర ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ పోటీ లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న వారు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పరుపులపై 90 నిమిషాల పాటు నిద్రపోయారు. పోటీ సమయంలో పాల్గొనేవారి నిద్రను స్లీప్ ట్రాకింగ్ పరికరాల ద్వారా నిశితంగా పరిశీలించారు.
ఎవరెవరు ఎంత వేగంగా గాఢనిద్రలోకి జారుకుంటున్నారు, ఆ గాఢనిద్ర ఎంత స్థిరంగా కొనసాగుతోంది అనే అంశాలను ఆధారంగా తీసుకుని విజేతను నిర్ణయించారు. సాధారణంగా క్రీడా పోటీల్లో వేగం, శక్తి, నైపుణ్యం కీలకంగా ఉంటాయి. అయితే ఈ పోటీలో మాత్రం శరీరం, మెదడు ఎంత త్వరగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయనే అంశమే ప్రధాన ప్రమాణంగా నిలిచింది.
ఈ పోటీలో సుయిమీ అనే మహిళ విజేతగా నిలిచారు. ఇతర పోటీదారులతో పోలిస్తే ఆమె అత్యంత వేగంగా గాఢనిద్రలోకి జారుకున్నట్లు స్లీప్ ట్రాకింగ్ డేటా ద్వారా తేలింది. విజేతగా నిలిచిన సుయిమీకి బహుమతిగా 2 మిలియన్ల యోన్లు అందజేశారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 12 లక్షల రూపాయల సమానమని నిర్వాహకులు తెలిపారు.
నిద్రలేమి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సమస్యగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తించడంతో పాటు, ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై చర్చకు దారితీస్తున్నాయని స్థానిక మీడియా విశ్లేషించింది. టోక్యోలో జరిగిన ఈ "మ్యాట్ రేస్" పోటీకి యువతతో పాటు మధ్యవయస్కులు కూడా మంచి స్పందన ఇచ్చినట్లు సమాచారం.







