దేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ISRO)లో క్లర్క్ స్థాయి ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటీస్ విడుదలైంది. మొత్తం 242 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ , జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ , స్టెనోగ్రాఫేర్ వంటి వివిధ కేటగిరీల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 27 నుంచి ప్రారంభమై ఆగస్టు 16, 2026 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాతపరీక్ష ఆధారంగా నిర్వహించబడనుంది.

ఇస్రో వివిధ కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట కేంద్రంలో 49 పోస్టులు, హైదరాబాద్ కేంద్రంలో 15 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఇతర కేంద్రాల్లో కూడా మిగతా పోస్టులు విభజన చేసినట్లు సమాచారం.

అర్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ , స్టెనోగ్రాఫేర్ పోస్టులకు స్టెనోటైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నియమావళి ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు ఉండే అవకాశం ఉంది.

దరఖాస్తు ఫీజు ₹500గా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు విధానం, రాతపరీక్ష సిలబస్, పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ వంటి వివరాలు ఇస్రో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అర్హతలు, వయోపరిమితి, కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు, సేవా నిబంధనలు, పరీక్ష విధానం వంటి అంశాలను పరిశీలించాలని ఇస్రో సూచించింది.

ఇస్రోలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న గ్రాడ్యుయేట్ యువతకు ఈ నియామక ప్రక్రియ మంచి అవకాశంగా భావిస్తున్నారు. దేశ అంతరిక్ష కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనుకునే అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

దరఖాస్తులు, నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇస్రో అధికారిక వెబ్‌సైట్: https://www.isro.gov.in/ ను సందర్శించాలి.