రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: ఇండియన్ రైల్వేలో Non టెక్నికల్ పాపులర్ కాటగరీస్ (NTPC) కింద 3,548 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ప్రకటన జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ప్రధాన పోస్టులు: చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపెర్వైసోర్ , గూడ్స్ ట్రైన్ మేనేజర్ , జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ , సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ . అన్ని పోస్టులకు డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 2027 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
వేతన పరంగా చూస్తే, ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సేవా నిబంధనలు రైల్వే నియమావళి ప్రకారం ఉంటాయి.
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – 1, CBT – 2 పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ పరీక్షలకు పిలుస్తారు. అన్ని దశల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 2026 అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2026 నవంబర్ 6. ఫీజు చెల్లింపు చివరి తేదీ 2026 నవంబర్ 8గా నిర్ణయించారు.
దరఖాస్తులో చేసిన వివరాల్లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రత్యేకంగా గడువు కల్పించారు. 2026 నవంబర్ 9 నుంచి 2026 నవంబర్ 18 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, పరీక్ష విధానం, సిలబస్, ఫీజు వివరాలు, ఇతర నిబంధనలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. దరఖాస్తు, ఫీజు చెల్లింపు, సవరణల కోసం అధికారిక పోర్టల్:
వెబ్సైట్: https://www.rrbapply.gov.in/#/auth/landing
రైల్వేలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే గ్రాడ్యుయేట్ యువతకు ఈ NTPC నోటిఫికేషన్ మంచి అవకాశంగా భావిస్తున్నారు. నిర్ణయించిన గడువుల్లోనే దరఖాస్తు పూర్తి చేయాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.







