రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్:
తెలంగాణలో అంగన్వాడీ భర్తీలు త్వరలోనే: 15,982 పోస్టుల కోసం ప్రభుత్వం సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 15,982 టీచర్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే సమగ్ర నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ICDS ప్రాజెక్టు పరిధిలో 177 పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్‌లు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేసేందుకు సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈసారి అంగన్వాడీ నియామకాల్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా కనీస విద్యార్హతను పెంచడంతో పాటు, ఎంపిక విధానంలో ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలకు అనుమతి, మార్కుల వెయిటేజీ వంటి అంశాలపై ప్రభుత్వం G.O. నెంబర్ 4, G.O. నెంబర్ 6లను విడుదల చేసింది.
రాష్ట్రాన్ని రెండు మల్టీ జోన్లుగా విభజించి ఖాళీలను గుర్తించారు. మల్టీ జోన్ 1 పరిధిలో మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 1,853 టీచర్ పోస్టులు, 7,737 అసిస్టెంట్ పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. మల్టీ జోన్ 2లో 15,197 కేంద్రాలు ఉండగా, అందులో 1,247 టీచర్ పోస్టులు, 5,145 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు మల్టీ జోన్లలో కలిపి మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీచర్, అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పాసైన అభ్యర్థులు లభించని పరిస్థితిలో పదో తరగతి ఉత్తీర్ణులను కూడా పరిశీలించే అవకాశం ఉంది. దరఖాస్తుదారులు సంబంధిత గ్రామం లేదా పట్టణ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలి.
ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధంగా నిబంధనలు రూపొందించారు. గిరిజన, ఆదివాసి తండాలు, గూడాల్లోని పోస్టులకు స్థానిక ST మహిళలు మాత్రమే అర్హులు. అలాగే SC వాడల్లోని పోస్టులకు స్థానిక SC మహిళలకే అవకాశం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. మొత్తం ఎంపికలో ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూ కోసం 10 మార్కులు కేటాయించారు. అదనంగా అనాధలకు 10 శాతం, వితంతువులకు 5 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు.
అర్హత కలిగిన స్థానిక మహిళలు తమ తమ జిల్లాల్లో విడుదలయ్యే ICDS నోటిఫికేషన్‌లను గమనిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.







