కర్నూలు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 913 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించగా, ఇందులో కర్నూలు జిల్లాకు 65, నంద్యాల జిల్లాకు 21 ఆశా కార్యకర్తల పోస్టులు కేటాయించారు.

జిల్లా స్థాయిలో ఈ నియామకాలను డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా చేపట్టనున్నారు. సంబంధిత జిల్లాలోని నియామక ప్రక్రియకు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గ్రామాలు, వార్డుల వారీగా ఖాళీలను గుర్తించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపికలు జరపనున్నారు.

ఆశా కార్యకర్తల నియామకానికి సంబంధించి అర్హత ప్రమాణాలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కనీస విద్యార్హతగా పదో తరగతి ఉత్తీర్ణతను నిర్దేశించారు. స్థానిక మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా నియామకాలు ఉండనున్నాయి.

ఆశా కార్యకర్తలుగా ఎంపికయ్యే వారికి నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది. గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవల విస్తరణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు వంటి కార్యక్రమాల్లో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నియామకాలతో గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలు, వెనుకబడిన గ్రామాల్లో ఆరోగ్య సేవల అందుబాటు మెరుగుపడే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.