రాయలసీమ న్యూస్, కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి దూకుడు పెంచారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి మాచాని సునీత, ఎన్డీఏ కూటమి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను సంప్రదించారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా 39వ వార్డు మల్లారివీధి, తొపయ్య గుడి ప్రాంతంలో తురేగల్ నజీర్, 40వ వార్డు ముగతి పేటలో శ్రీమతి కనికె మహాదేవి, 41వ వార్డు ముగతి పేటలో శ్రీమతి బండ జమున, 42వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో శ్రీమతి ఎదిగ లక్ష్మి, 43వ వార్డు శివన్న నగర్లో శ్రీమతి పి. షహీన్ బేగం, 44వ వార్డు శివన్న నగర్, జోగి కాలనీలో వై. ఎర్రన్న, 29వ వార్డు సంజీవయ్య నగర్, ఎల్లమ్మబేడులో బీజేపీ అభ్యర్థి శ్రీమతి వీజీ ఉషా గంగలకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, చెత్తపై పన్ను విధానం, అమ్మఒడి వంటి పథకాల అమలు తీరుపై ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలను ఓటర్లకు తెలియజేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలో రూ.157 కోట్ల వ్యయంతో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

అలాగే బనవాసి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ ద్వారా చేనేత రంగానికి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని, మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు.
“ఎమ్మిగనూరు అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ప్రతి వార్డులో సైకిల్ గుర్తుకు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి” అని ఎమ్మెల్యే గారు ప్రజలను కోరారు.
ఎమ్మిగనూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలందరూ ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని డాక్టర్ జయ నాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.














