నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో నగరపాలక సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకోనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన నగరంలో పూర్తి అయిన కీలక అభివృద్ధి పనులను పరిశీలించి, తుది ఏర్పాట్లను సమీక్షించారు.

కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. చారిత్రాత్మక గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ, చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఆంజనేయస్వామి ఆలయం వెనుక నిర్మించిన నూతన బైపాస్ రహదారి, అలాగే కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ బుధవారం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

గడియారం ఆసుపత్రి ఆధునికీకరణతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కమిషనర్ వివరించారు. నూతన బైపాస్ రహదారి ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొండారెడ్డి బురుజు ఓపెన్ థియేటర్ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్షన్ స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక, వినోదాత్మక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం కలుగుతుందని కమిషనర్ తెలిపారు.

అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు విజయలక్ష్మి నగర్‌లో డ్రైనేజీ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, శాశ్వత పరిష్కారం కోసం నూతన డ్రైనేజీ కాలువ నిర్మించాలని ఆదేశించారు.

అనంతరం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఏసీపీ నాగరాజు, డీఈఈ శ్రీనివాసన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రవి, మునిస్వామి, వలి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సౌకర్యాల మెరుగుదల దిశగా నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ఈ కొత్త ప్రాజెక్టులు తోడ్పడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.