కర్నూలు: జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని సంక్షేమ విభాగాల ప్రిన్సిపాల్స్, వార్డెన్‌లను ఆమె హెచ్చరించారు.

గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సంక్షేమ శాఖలకు సంబంధించిన పురోగతి పై అన్ని సంక్షేమ విభాగాల ప్రిన్సిపాల్స్, వార్డెన్‌లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులపై విపులంగా చర్చించారు.

వసతి గృహాలను తరచుగా తనిఖీ చేస్తానని, తనిఖీల సమయంలో లోపాలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. వసతి గృహాల వార్డెన్లు, కుక్‌లు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రతి నెలా సెన్సిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.

వసతి గృహాలలో టాయిలెట్లు, గదులు, హాస్టల్ ప్రాంగణం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత వార్డెన్లు, సిబ్బందిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులను విడిచి ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్నందున, వారికి తల్లిదండ్రుల లాగా సంరక్షణ, ఆప్యాయత అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆమె అన్నారు. ఎమ్ఈఓలు, ఎంపిడిఓలు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, ఈ విద్యా సంవత్సరంలో గతంతో పోలిస్తే పాస్‌ శాతాన్ని కనీసం 15 శాతం కంటే ఎక్కువగా పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో తాగునీటి నాణ్యతపై నిరంతరం పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని, మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తూ పనులు నాణ్యతతో జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని, అన్నం సక్రమంగా ఉడికించడంతో పాటు సరిపడా పరిమాణంలో భోజనం అందించాలన్నారు.

భోజనానికి సంబంధించిన బిల్లులు, ఖర్చులు, విద్యార్థులకు అందిస్తున్న భోజన పరిమాణం, నాణ్యతను సరిపోల్చి పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. నాసిరకం భోజనం అందిస్తూ బిల్లులు పొందుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

వార్డెన్లు, సంబంధిత సిబ్బంది తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్లలో సోక్‌పిట్లు, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ప్లాంటేషన్ పనుల్లో పురోగతి తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని వార్డెన్‌లను ఆమె ఆదేశించారు.

సమావేశంలో డ్వామా పిడి నరసింహ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, వార్డెన్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.