రాయలసీమ న్యూస్, కర్నూలు:
వ్యాపారంలో భాగస్వామ్యమంటారు, బురిడీకొట్టిస్తారు
కర్నూలు:- ఫ్రాంచైజీ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారం చేయాలనుకునే నిరుద్యోగులు, అమాయకులను లక్ష్యంగా చేసుకొని లక్షల్లో రూపాయలు దోచుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ తరహా మోసాలకు నిదర్శనంగా నిలిచింది.
కర్నూలు నగరానికి చెందిన ఓ వ్యక్తికి వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉండేది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ నూతన పెయింటింగ్స్ సంస్థ ఫ్రాంచైజీ ప్రకటన ఆయన దృష్టికి వచ్చింది. అందులో ఇచ్చిన ఫోన్ నంబరుకు సంప్రదించగా, అవతలి వ్యక్తి ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన మరొకరితో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న వ్యక్తికంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఫ్రాంచైజీని తనకే ఇస్తామని బాధితుడిని నమ్మబలికాడు.
అపరిచితుడి మాటలను నమ్మిన జిల్లా వాసి, అతను సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షలు జమ చేశాడు. అనంతరం వాట్సప్ ద్వారా తన వివరాలన్నీ పంపించాడు. రెండు రోజుల్లో ఫ్రాంచైజీ ఒప్పంద పత్రాలు పంపిస్తామని నమ్మబలికిన ఆ వ్యక్తి, కొద్ది సేపటికే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ప్రముఖ సంస్థల పేర్లు వినియోగిస్తూ ఇలాంటి మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎంత వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుందో ఆకర్షణీయంగా వివరించి, రోజూ సులువుగా నిర్దిష్ట లాభం వస్తుందని నమ్మబలుకుతున్నారు. పెట్టుబడి కొన్ని నెలల్లోనే తిరిగి వస్తుందని, ఎక్కువ వ్యాపారం చేస్తే ఎక్కువ రాయితీలు, విదేశీ టూర్లు కల్పిస్తామని ప్రలోభపెడుతున్నారు. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
టీస్టాళ్లు, ఆహార సంస్థలు, ఇతర వ్యాపారాలకు సంబంధించిన ఫ్రాంచైజీ ప్రకటనలను మోసగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ వినిపించని సంస్థల పేర్లు, మార్కెట్లో లేని ఉత్పత్తుల పేర్లతో ప్రకటనలు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనలను నమ్మి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఇప్పటికే మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గొలుసుకట్టు వ్యాపారాల కారణంగా జిల్లా ప్రజలు కోట్ల రూపాయలు నష్టపోయిన సందర్భాలు, ఆ సంస్థలకు ఏజెంట్లుగా ఉన్న కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఆరా తీశాకే ముందడుగు
నేరాల నియంత్రణలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫ్రాంచైజీల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రకటనలు చూసి తొందరపడకుండా, ముందుగా ఆ సంస్థ గురించి పూర్తి వివరాలు సేకరించాలని సూచిస్తున్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందో తెలుసుకొని, సాధ్యమైనంత వరకు స్వయంగా వెళ్లి పరిశీలించాలంటున్నారు.
ఆ సంస్థకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉందో లేదో నిర్ధారించుకోవాలని, ఇప్పటికే ఆ సంస్థ ఫ్రాంచైజీలు తీసుకున్న వారి వివరాలు తెలుసుకొని వారితో మాట్లాడాలని సూచిస్తున్నారు. కొత్త సంస్థ అయితే ఉత్పత్తులు ఎక్కడ తయారవుతున్నాయో తెలుసుకొని పరిశీలించాలి. ఒప్పందం చేసుకునే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా సంస్థ ఖాతాల్లోనే డబ్బు జమ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా సైబర్‌క్రైం హెల్ప్‌లైన్ నంబరు 1930కు సంప్రదించాలని, సమీప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు, వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు ఇలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని నేరవిభాగం అధికారులు పిలుపునిస్తున్నారు.













