కర్నూలు జిల్లా పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సేవల అమలుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత బలపడేలా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కర్నూలు కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె వివిధ శాఖల అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంశాలపై సమీక్ష చేపట్టారు.

జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉందన్న దానిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అధికారులు కోరారు. ప్రజలు ప్రభుత్వంపై, అధికారులపై కలిగే అభిప్రాయం నేరుగా సేవల నాణ్యత, వేగం, పారదర్శకతపై ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రతి శాఖ తమ పనితీరును మెరుగుపరుచుకుని, ప్రజలకు అందించే సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు.

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సూచికల్లో జిల్లాకు వచ్చే ర్యాంకులు, వివిధ శాఖల పనితీరు గణాంకాలను సమావేశంలో కలెక్టర్ పరిశీలించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పరంగా లక్ష్యాలు ఎలా ఉన్నాయో, వాటి సాధనలో ఎక్కడ లోపాలు ఉన్నాయో అధికారులను ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలను సకాలంలో పరిష్కరించడం, గ్రామస్థాయిలో సేవల అందుబాటును పెంచడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవల అందజేతను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించారు.

ప్రతి శాఖ తమ పనితీరును రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్‌లో నిలిపేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సిరి అధికారులకు సూచించారు. ఇందుకోసం శాఖల వారీగా బాధ్యతలను స్పష్టంగా నిర్వచించి, సమయపాలన పాటిస్తూ, ప్రజలతో నిరంతర సంబంధం కొనసాగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో అధికారులు ప్రజల మధ్య ఎక్కువగా ఉండి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షలో వివిధ శాఖల అధికారి‌లు పాల్గొన్నారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్‌లకు అనుగుణంగా తమ శాఖల్లో చేపట్టాల్సిన చర్యలపై వారు కలెక్టర్‌కు వివరాలు అందించారు. జిల్లాను అన్ని సూచికల్లో ముందంజలో నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సమావేశంలో అధికారులను ఆదేశించారు.