రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శరీన్‌నగర్‌కు చెందిన ఐదుగురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ A. సిరి, IAS జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన ఈ వ్యక్తులు జిల్లాలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, IPS ఆధ్వర్యంలో పోలీసులు వీరి కదలికలను గమనించి నివేదికను కలెక్టర్‌కు పంపినట్లు సమాచారం.
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శరీన్‌నగర్‌లో నివాసముండే కిరాయి హంతకుడు షీట్ నెంబర్ 1 అయిన వడ్డే రామాంజనేయులు @ వడ్డే అంజి, రౌడీ షీట్ నెంబర్ 389 కలిగిన వడ్డే తులసి కుమార్, రౌడీ షీట్ నెంబర్ 387 కలిగిన వడ్డే రేవంత్ కుమార్, రౌడీ షీట్ నెంబర్ 388 కలిగిన వడ్డే శివకుమార్, సస్పెక్ట్ షీటర్ 216 అయిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్ అనే ఈ ఐదుగురిపై జిల్లా బహిష్కరణ అమలు చేయబడింది.
కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వడ్డే రామాంజనేయులు @ వడ్డే అంజిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో 17కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. శరీన్‌నగర్‌కు చెందిన వడ్డే రామాంజనేయులుపై హత్య, హత్యాయత్నం సహా ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి. ఇతని కుమారులు రేవంత్ కుమార్, శివకుమార్, తులసి కుమార్‌లపై కూడా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఒక్కొక్కరిపై ఐదేసి నమోదయ్యాయి.
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో వడ్డే రామాంజనేయులుపై కిరాయి హంతకుడిగా షీట్ తెరవగా, ఇతని కుమారులపై రౌడీ షీట్లు ఉన్నాయి. తెదేపా నాయకుడు సంజన్న హత్య కేసులో నిందితులైన వీరు జైలుశిక్ష అనంతరం బయటకు వచ్చిన తర్వాత, 2025 డిసెంబరులో కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల అనంతరం ఇటీవల వీరు మళ్లీ కర్నూలుకు తిరిగొచ్చిన నేపథ్యంలో, వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.
పోలీసుల నిఘా సమయంలో వీరి ప్రవర్తనలో మార్పు రాలేదని గుర్తించడంతో, మరోసారి జిల్లా బహిష్కరణ విధించాలని కలెక్టర్ నిర్ణయించారు. శరీన్‌నగర్‌కు చెందిన పఠాన్ ఇమ్రాన్ ఖాన్‌పై 19 క్రిమినల్ కేసులు ఉండటంతో, ఇతనిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ తెరవబడింది. గతంలో ఇతనిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి కడప జిల్లా కారాగారంలో ఉంచినా, ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల్లో ఇతనిని కూడా చేర్చారు.













