కర్నూలు: కర్నూలు జిల్లా న్యాయ సేవా సదన్‌లో సెప్టెంబర్ 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పి. వాసు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫుల్ అడిషనల్ చార్జ్ చైర్మన్ మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, కర్నూలు, అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అధ్యక్షత వహించారు.

నంద్యాల జిల్లా పోలీస్ అధికారులు, కర్నూలు ఎక్సైజ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, లోక్ అదాలత్‌కు సంబంధించిన ఏర్పాట్లు, పరిష్కరించాల్సిన కేసులపై చర్చించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రజలకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కోర్టుల్లో ప్రతి రోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమావేశంలో వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ కేసులను ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్‌లలో రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని అధికారులు కోరారు. రాజీ ద్వారా కేసులు ముగిసితే, ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, కోర్టులపై భారాన్ని కూడా తగ్గించవచ్చని సూచించారు.

జాతీయ లోక్ అదాలత్‌కు ముందుగా పెండింగ్ కేసుల జాబితా, రాజీ సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖలు సమగ్రంగా పరిశీలించాలని, ప్రజలకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ కృష్ణా రెడ్డి, నంద్యాల జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, యస్ ఐలు పాల్గొన్నారు. పోలీస్, ఎక్సైజ్ శాఖలతో పాటు న్యాయ సేవా సంస్థల సమన్వయంతో జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని సమావేశం ముగింపులో మరోసారి పునరుద్ఘాటించారు.