కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, బ్లాక్ స్పాట్ల వద్ద పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా నిర్వహించారు.

సమావేశంలో రోడ్డు భద్రత, బ్లాక్ స్పాట్ల వద్ద జరుగుతున్న పనుల పురోగతి, నగరంలో ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ జాతీయ రహదారి (NH)కు లింక్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి 10 రోజుల్లో పురోగతి నివేదిక తీసుకురావాలని కలెక్టర్, కర్నూల్ మునిసిపల్ కమీషనర్ ను ఆదేశించారు.

ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పాత కల్లూరు రోడ్డు నుండి హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ కేశవ్ గ్రాండ్ సమీపంలోని ప్రస్తుత రహదారిని అనుసంధానించే పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటుతో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

రాళ్లదొడ్డి గ్రామంలో ఉన్న S కర్వ్ కారణంగా ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ రెండు వైపుల రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆదోని RDO‌కు ఆదేశాలు జారీ చేశారు. కిడ్స్ వరల్డ్ నుండి కలెక్టరేట్ కాంప్లెక్స్ వరకు చేపట్టనున్న రోడ్ విస్తరణ పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉల్చాలా జంక్షన్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారుల వెంట ఉన్న అనధికార ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

పాదచారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లలో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. హిట్ అండ్ రన్ ఘటనలకు సంబంధించిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన కేసులు పెండింగ్‌లో ఉన్నవాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమావేశంలో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేశారో నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో గుర్తించిన చీకటి ప్రదేశాలను సురక్షితమైన ప్రదేశాలుగా అభివృద్ధి చేసే పనుల్లో పురోగతి ఏ స్థాయిలో ఉందో కర్నూల్ మునిసిపల్ కమీషనర్ ను ప్రశ్నించారు.

సమావేశంలో R&B SE మహేశ్వర రెడ్డి , DTC శాంతకుమారి , పంచాయతీ రాజ్ SE ప్రభాకర్ రెడ్డి , నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత , డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ Dr. భాస్కర్ రాజు , APSRTC RM శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.