రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 20వ తేదీ లోపు అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
జిల్లాలో తాగునీటి పరిస్థితి, రిజర్వాయర్లు, ట్యాంకుల్లో నీటి నిల్వ స్థితిగతులపై గురువారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, హంద్రీనీవా, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎస్ ఈ లతో కలెక్టర్ సమీక్ష చేపట్టారు.
టెలికాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత తాగునీటి సరఫరా, భవిష్యత్ అవసరాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల సామర్థ్యం, అందుబాటులో ఉన్న నీటి పరిమాణం వంటి అంశాలపై కలెక్టర్ వివరాలు కోరారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు వివరించారు.
జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండి, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, నీటి నిల్వలు, పంపింగ్, పంపిణీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నింపుదలపై రోజువారీగా పర్యవేక్షణ చేసి, పురోగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా, బోర్లు, ఫిల్టర్ పాయింట్లు వంటి వనరులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ టెలికాన్ఫరెన్స్లో కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, హంద్రీనీవా ఎస్ ఈ రాజన్ బాబు, ఇరిగేషన్ ఎస్ ఈ శైలేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.













