కర్నూలు: ప్రపంచ హార్ట్ దినోత్సవం (World Heart Day 2026) సందర్భంగా ఈ నెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు ఎ-క్యాంప్‌లోని కర్నూల్ హెల్త్ క్లబ్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రచార పోస్టర్‌ను గురువారం విజయవాడలోని చీఫ్ సెక్రటరీ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జి. సాయి ప్రసాద్, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, MD, DM, యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి. సాయి సుధీర్ లు కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ 2002 సెప్టెంబర్‌లో కర్నూలులో స్థాపించబడింది. అప్పటి కర్నూల్ జిల్లా కలెక్టర్ జి. సాయి ప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షులుగా, వ్యవస్థాపక కార్యదర్శిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.

గుండె జబ్బుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2003 నుంచి ప్రతి ఏడాది ప్రపంచ హృదయ దినోత్సవ కార్యక్రమాలను కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. నివారణాత్మక కార్డియాలజీ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.

ఈ నెల 29వ తేదీ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఎ-క్యాంప్‌లోని కర్నూల్ హెల్త్ క్లబ్‌లో జరగనున్న అవగాహన కార్యక్రమంలో ప్రజలు, వైద్య ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు కోరుతున్నారు.