రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఎన్.డి.ఏ కూటమికి చెందిన తెలుగుదేశంపార్టీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానికి టీడీపీ జోన్–5 కోఆర్డినేటర్, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి శ్రీ పెళ్ళకూరు శ్రీనివాస రెడ్డి, జనసేన కోఆర్డినేటర్ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ చింతా సురేష్, శ్రీమతి రేఖ గౌడ్, శ్రీ అర్షద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బి. రామకృష్ణ పరమహంస, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు శ్రీ విట్టా రమేష్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి నూటికి నూరు శాతం విజయం సాధించేలా సమష్టి కార్యాచరణను రూపొందించుకోవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కూటమి శ్రేణులు ఒకే తాటిపై నడుస్తూ, బూత్ స్థాయిలో సమన్వయాన్ని బలోపేతం చేయాలని నాయకులు చర్చించినట్లు సమావేశం అనంతరం తెలియజేశారు.
కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి, ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు చేరువైన పాలన వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ కూటమి అభ్యర్థులను ప్రజల ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.













