రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో యువత భవిష్యత్తు, విద్యా సదుపాయాల అభివృద్ధిపై పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ దృష్టి సారించారు. యువత భవితకు భరోసా కార్యక్రమంలో భాగంగా స్థానిక కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాశాల సిబ్బందితో ఎమ్మెల్యే ఆత్మీయంగా మాట్లాడారు.
కళాశాలలో ఉన్న విద్యా సౌకర్యాలు, ఇంకా అవసరమైన వసతులపై ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యేను చూసిన విద్యార్థులు ఉత్సాహంగా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. కళాశాల వాతావరణం, బోధన విధానం, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై కూడా ఎమ్మెల్యే ఆసక్తి చూపినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.
ఈ సందర్శన సందర్భంగా కళాశాల సిబ్బంది కంప్యూటర్ల కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కంప్యూటర్ ల్యాబ్‌లో పరికరాలు తక్కువగా ఉండటంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యాన్ని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
సిబ్బంది, విద్యార్థుల వినతిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అవసరమైన కంప్యూటర్లను తన సొంత నిధులతో సమకూర్చే బాధ్యతను స్వీకరించారు.
“నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు ఎంతో అవసరం. మన నియోజకవర్గంలోని విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించేందుకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. కంప్యూటర్ల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో త్వరలోనే నా సొంత నిధులతో కంప్యూటర్లను అందిస్తాను” అని ఎమ్మెల్యే కేఈ.ఈ. శ్యామ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రాన్ని యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.
“యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు తాను ముందుండి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో విద్యా రంగం అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.













