రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: పీఎం సూర్య ఘర్ పథకం కింద లబ్ధిదారులకు సౌర ప్యానల్ ఇన్‌స్టాలేషన్ పనులను అక్టోబర్ 15లోగా పూర్తి చేయాలని, అలాగే సబ్ స్టేషన్‌ల నిర్మాణాన్ని త్వరితగతిన ముగించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి విద్యుత్ శాఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు, సబ్ స్టేషన్‌ల ఏర్పాటుపై విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాల పురోగతి, లక్ష్య సాధన, మెటీరియల్ లభ్యత, ఫీల్డ్ స్థాయి పనులపై వివరాలు సేకరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాల అమలుపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆలస్యం చేయకుండా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి లబ్ధిదారికి సోలార్ ప్యానల్‌లు ఇన్‌స్టాల్ అయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో హాజరైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను వారి పరిధిలో నిర్దేశించిన లక్ష్యం ఎంత, ఇప్పటివరకు ఎంత మెటీరియల్ అందింది, ఏ మేరకు లక్ష్యాన్ని సాధించారు అనే అంశాలను విడివిడిగా పరిశీలించారు. అక్టోబర్ 15నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను, వెండర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు జరుగుతున్న పనులను, వివిధ పథకాల పురోగతిని ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మా రూపంలో సమర్పించాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని వెండర్లకు హెచ్చరించారు.
బ్యాంకు లోన్‌ల కోసం పరిశీలనలో ఉన్న 804 అప్లికేషన్లలో కనీసం 600 అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేసి పంపాలని ఎల్‌డిఎం మోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఉన్న లక్ష్యాలతో పాటు ఈ 600 అప్లికేషన్ల ప్రకారం కూడా పనులను ప్రారంభించాలని అధికారులు, వెండర్లను సూచించారు. అలాగే సచివాలయాల ద్వారా ప్రైవేట్ ఇళ్ల కోసం కూడా కొత్తగా అప్లికేషన్లు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కర్నూలు నగరంలో పెరుగుతున్న విద్యుత్ లోడ్ అవసరాన్ని తీర్చేందుకు సంతోష్ నగర్, గణేష్ నగర్, కలెక్టరేట్ ప్రాంగణంలో సబ్ స్టేషన్‌ల ఏర్పాటు కోసం 25 సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయించవలసిందిగా APSPDCL SE ప్రదీప్ కుమార్ కలెక్టర్‌ను కోరారు.
జిల్లాలో తొమ్మిది ప్రదేశాల్లో సోలార్ సబ్ స్టేషన్‌ల ఏర్పాటుకు వృద్ధి ఇన్ఫ్రాటెక్‌కు చాలా తక్కువ సమయంలో స్థలాలు కేటాయించిన విషయాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. వారికి నిర్దేశించిన గడువుల ప్రకారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో పనులు పూర్తి చేసి సబ్ స్టేషన్‌లను నెలల వారీగా అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో APSPDCL SE ప్రదీప్ కుమార్, EEలు సురేష్, పురుషోత్తం, విజయభాస్కర్, DEలు సుబ్బన్న, నాగ ప్రసాద్, చంద్రన్న, LDM మోహన్, సోలార్ వెండర్లు బృహస్పతి టెక్నాలజీ తరఫున లోకేష్, Rotomag తరఫున కృష్ణ ప్రసాద్, VSA Infra తరఫున శ్రీరామ్, వృద్ధి ఇన్ఫ్రా తరఫున రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వెండర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.













