రాయలసీమ న్యూస్, కర్నూలు: నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో ప్రజా సౌలభ్యాన్ని కేంద్రబిందువుగా తీసుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి పనిలో ప్రణాళికతో పాటు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం కమిషనర్ చల్లా ఓబులేసు వినాయకఘాట్ వద్ద రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని పరిశీలించారు. రహదారి నిర్మాణ నాణ్యత, వినియోగ సౌలభ్యం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను కూడా తనిఖీ చేసి, అక్కడి నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మొత్తం రూ.88.06 కోట్ల వ్యయంతో వివిధ రకాల పనులను చేపట్టినట్లు తెలిపారు. చేపడుతున్న ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడంతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గణేష్ నిమజ్జనం సమయంలో వినాయకఘాట్ వద్ద ప్రజలకు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ వివరించారు. దేవనగర్ రహదారి వెంట, అలాగే KC Canal ఒడ్డు వద్ద వాహనాల రాకపోకలకు సౌకర్యం కల్పించే విధంగా సీసీ రహదారులను నిర్మించినట్లు తెలిపారు.
సీసీ రహదారుల నిర్మాణంలో క్యూరింగ్ కోసం ఇకపై మట్టిని ఉపయోగించకుండా, సిమెంట్‌తోనే పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు వెల్లడించారు. దీని ద్వారా రహదారుల నాణ్యత, ఆయుష్షు మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అభివృద్ధి పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. నగర అభివృద్ధి పనుల్లో ప్రజా సౌలభ్యం, భవిష్యత్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలు సమన్వయంతో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో DEE సి. నరేష్, Sanitary Inspector ఫరుక్ తదితరులు పాల్గొన్నారు.













