నగర అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు అందించేందుకు రహదారి మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.

కొండారెడ్డి బురుజు నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి కూడలి, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా వై. జంక్షన్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులు జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. ఈ పనులకు రూ.2.23 కోట్ల వ్యయం అవుతున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ఉపరితలాన్ని మెరుగుపరచడంతో పాటు రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని సూచికల ఏర్పాటు కూడా చేపట్టినట్లు ఆయన వివరించారు. నగరంలోని 14 కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట అవసరమైన చోట్ల రోడ్ మార్కింగ్స్, సెంటర్ లైన్స్, ఎడ్జ్ లైన్స్, లేన్ లైన్స్, జీబ్రా క్రాసింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ వంటి సూచికలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పనుల కోసం నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు వెల్లడించారు. వీటి ద్వారా వాహనదారులు, పాదచారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం లభించడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందని ఆయన చెప్పారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. మెరుగైన రహదారులు, క్రమబద్ధమైన రవాణా వ్యవస్థతో నగరాన్ని మరింత సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.