రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27వ తేదీల్లో కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో ఈ శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది విద్యార్థి ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొననున్నారని రంగప్ప పేర్కొన్నారు. విద్యార్థి నాయకులు, ప్రతినిధులకు విద్యా రంగం, సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, సామాజిక చైతన్యాన్ని బలోపేతం చేయడం, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమని రంగప్ప అన్నారు. ఇందుకోసం వివిధ అంశాలపై నిపుణుల ద్వారా బోధన, చర్చలు, పరస్పర సంభాషణలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థి ప్రతినిధులు ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యేలా ఎస్ఎఫ్ఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడానికి విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయులు సహకరించాలని రంగప్ప కోరారు.
విద్యార్థి సమాజం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా మారాలంటే శాస్త్రీయ ఆలోచన, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలపై స్పష్టమైన అవగాహన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎస్ఎఫ్ఐ చేపడుతున్న శిక్షణా తరగతులు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనున్నాయని రంగప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.













