రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్తగా అర్హత సాధించిన ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని బూత్ లెవల్ అధికారులకు ఈఆర్వో, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని ఈఆర్వో సమీక్షించారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు, అనర్హుల పేర్ల తొలగింపు, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని ఆయన అధికారులకు వివరించారు.
క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నందున, ఆ సమయానికి ముందుగానే సంబంధిత దరఖాస్తులు స్వీకరించేలా బిఎల్వోలు జాగ్రత్తలు తీసుకోవాలని చల్లా ఓబులేసు సూచించారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం తమ బాధ్యతగా భావించి, ఎవరూ మిగిలిపోకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం–6ను వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో అనర్హుల పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం–7ను ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవాలనుకునే వారు, లేదా నివాస మార్పు కారణంగా ఇతర ప్రాంతానికి ఓటరు జాబితా బదిలీ కావాలనుకునే వారు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగం నిర్ధారించుకునేలా తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఈఆర్వో చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. అవసరమైన క్లెయిమ్లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆయన సూచించారు.
స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి సహా సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా హాజరు, దరఖాస్తుల స్వీకరణ, ప్రజల స్పందన వంటి అంశాలపై ఈఆర్వో వివరాలు తెలుసుకున్నారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం.













