కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామీణ పరిధిలో గంజాయి రవాణా ముఠాపై పోలీసులు బారి వేసి ఏడుగురిని అరెస్టు చేశారు. నందవరం మండలంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం దాడులు నిర్వహించినట్లు గ్రామీణ సీఐ చిరంజీవి బుధవారం వివరాలు వెల్లడించారు.

నాగలదిన్నె శివారు మిట్టసోమాపురం మలుపులో ఉన్న ఓ రైస్‌మిల్లు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తున్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడుల్లో మిట్టసోమాపురం గ్రామానికి చెందిన తిప్పన్న, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్‌ షాషావలి, షేక్‌ చాంద్‌బాషా, భీమేష్‌లతో పాటు ఓ బాలుడు పట్టుబడినట్లు సీఐ తెలిపారు.

నిందితుల వద్ద నుంచి 3 కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ నుంచి తెచ్చుకున్నారన్న దానిపై పోలీసులు విచారణ జరిపారు. అదే మండలంలోని పెద్దకొత్తిలి శివారులో ఉన్న ఓ ఆశ్రమంలో గంజాయి పండించి, ఆరబెట్టి పొడి రూపంలో తయారు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.

దీనితో అక్కడ దాడులు నిర్వహించిన పోలీసులు గంజాయి పండించి విక్రయిస్తున్న సి.రాముడు, సి.నాగార్జునలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మరో 2.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కేసులో 5.3 కిలోల గంజాయి, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

ఈ ఆపరేషన్‌లో ఎస్సైలు తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, హెడ్‌ కానిస్టేబుళ్లు కోదండరామిరెడ్డి, సుభాన్, కానిస్టేబుళ్లు వీరేష్, భాస్కర్, వెంకటేశ్, సుధాకర్‌ పాల్గొన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయంపై పోలీసులు నిఘా మరింత పెంచినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.

గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎన్‌.భార్గవి మర్రివాడ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు ఎక్కడైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆమె ప్రజలను కోరారు.