ఎమ్మిగనూరు: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మిగనూరు మండల తాసిల్దార్‌కు రేషన్ డీలర్లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దీవి లీల మాధవరావు పిలుపు మేరకు మంగళవారం ఈ వినతిపత్రం సమర్పించినట్లు డీలర్లు తెలిపారు.

ఈ సందర్భంగా రేషన్ డీలర్ల పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్, పట్టణ ఉపాధ్యక్షులు ఈరన్న, డీలర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు డీలర్ల న్యాయమైన డిమాండ్లు, సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డీలర్లను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన QR కోడ్ విధానం కారణంగా కార్డు దారులు, డీలర్లు, లారీ హమాలీలకు తీవ్ర జాప్యం జరుగుతోందని డీలర్లు పేర్కొన్నారు. కొన్ని బ్యాగులకు స్కానింగ్ జరగక ఆ బ్యాగులు కార్డు దారులకు పంపిణీ కాకుండా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో సమస్యలు నెలకొన్నాయని, దీంతో డీలర్లు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

పనికి తగ్గ గౌరవ వేతనం లేకపోవడం, కమిషన్లు సరిపోకపోవడం, సక్రమంగా తూకాలు అందకపోవడం, గతంలో ఇచ్చిన గన్ని బ్యాగుల డబ్బులు అందకపోవడం వంటి సమస్యలను వారు వినతిపత్రంలో ప్రస్తావించారు. గన్ని బ్యాగుల్లో పనిచేసే డీలర్లకు 2019లో జారీ చేసిన G.O. నంబర్ 5ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మట్టి ఖర్చుల కోసం రూ.15,000 మంజూరు చేయాలని, ESI సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డీలర్లకు రక్షణ కల్పించాలని కోరారు. కమిషన్‌ను రూ.200 పెంచాలని, డోర్ డెలివరీ సేవలకు అదనపు సర్వీస్ చార్జీలు ఇవ్వాలని, డీలర్ సహాయకునికి సేవా రుసుము కింద రూ.5,000 చెల్లించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అద్దెగా రూ.5,000, పట్టణ ప్రాంతాల్లో రూ.7,500 చెల్లించేలా చూడాలని, డీలర్ల సంక్షేమ నిధి, పెన్షన్, ఇన్సూరెన్స్, ESI సదుపాయాల ద్వారా డీలర్ కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే విధంగా వెసులుబాటు కల్పించాలని వారు కోరారు.

1955 Essential Commodities Act మరియు PDS కంట్రోల్ Act ప్రకారం ఆథరైజేషన్ పొందిన డీలర్ రేషన్ షాప్‌లోనే సరుకులను అమ్మాలని, రేషనలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని, డీలర్లకు సమాన కార్డులు, సమాన అలాట్మెంట్ ఇచ్చి సమాన కమిషన్ విధానాన్ని అమలు చేయాలని డీలర్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

డీలర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి డీలర్ ఈ నెల 15వ తేదీన కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో పై సమస్యలతో కూడిన వినతిపత్రాలను జాయింట్ కలెక్టర్ కు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రతి డీలర్ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాయప్ప, ట్రెజరర్ ఖాజాముద్దీన్, రఖీబ్, సాజిదుల్లా, వెంకటేశప్ప, చంద్రశేఖర్, ఆదమలి, మధు, మన్సూర్, వెంకటరాముడు, రామకృష్ణ, శాంత శీన, అబ్బాస్, గంగన్న, రాము, రాబియా, శివ తదితరులు పాల్గొన్నారు.