రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: అన్యాయం చేసినవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం మనుషుల సహజ భావోద్వేగం. ప్రేక్షకుల్లోని ఆ భావాన్ని రెచ్చగొట్టే కథలే క్రైమ్, రివెంజ్ థ్రిల్లర్లు. అలాంటి చిత్రాలు ఎన్నిసార్లు వచ్చినా, ఆడియన్స్ ఆసక్తి మాత్రం తగ్గదు. అందుకే దర్శకులు, నిర్మాతలు తరచూ ఈ తరహా కథలను తెరపైకి తీసుకొస్తుంటారు. అదే కోవకు చెందిన తాజా చిత్రం ‘బేబీ డూ డై డూ’. హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించగా, నచికేత్ సమంత్ దర్శకత్వం వహించారు.
కథ ముంబయిలోని ఓ పాడుబడ్డ స్టార్ హోటల్ భవనంలో ప్రారంభమవుతుంది. ఇద్దరు కవల ఆడపిల్లలు ఆ భవనాన్ని చూడటానికి లోపలికి వెళ్తారు. వారిలో ఒకరు పుట్టుకతోనే మూగ, చెవిటి. ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి మరొకరిని హత్య చేయడం వారి కంటపడుతుంది. అలికిడికి తలెత్తి చూసిన హంతకుడికి ఒక అమ్మాయే కనిపిస్తుంది. అతడు ఆ బాలికను చంపేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న మూగ బాలికే ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర బేబీ (హ్యూమా ఖురేషి).
పెరిగి పెద్దయిన బేబీని జైన్ అలియాస్ పాపా (చుంకీ పాండే) చేరదీస్తాడు. అతని వద్ద ఆమె కాంట్రాక్ట్ కిల్లర్‌గా పనిచేస్తుంది. జాఫర్ (సికందర్ ఖేర్) అనే బిల్డర్ తన రియల్ ఎస్టేట్ దందాకు అడ్డొచ్చిన వారిని తొలగించే పనిని జైన్ గ్యాంగ్‌కు అప్పగిస్తుంటాడు. జనసమూహంలోకి వెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా అంబ్రెల్లా గన్నుతో టార్గెట్‌ను మట్టుబెట్టడం బేబీ ప్రత్యేక శైలి. తన అసైన్‌మెంట్‌లో భాగంగా మిక్కీ అనే ధనవంతుణ్ని హత్య చేస్తుంది. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలింపు ప్రారంభిస్తారు.
ఇదిలా ఉండగా, చిన్నప్పుడు కవల సోదరిని కోల్పోయిన చేదు జ్ఞాపకం బేబీని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సమయంలో పక్కింట్లో ఉండే సిద్ధూ (రచిత్ సింగ్) బేబీపై ప్రేమ పెంచుకొని, ఆమెను వివాహం చేసుకుంటాడు. పెళ్లి తరువాత బేబీ కాంట్రాక్ట్ కిల్లర్ అని భర్తకు తెలుస్తుంది. దీంతో అన్నీ వదిలేసి, భర్తతో ప్రశాంతంగా జీవించాలని బేబీ నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని జైన్, జాఫర్ అంగీకరిస్తారా? పోలీసులకు బేబీ చిక్కుతుందా? జాఫర్ ప్రాణసమానంగా భావించే తమ్ముడు లక్కీని చంపిందెవరు? బేబీ దగ్గర జైన్ దాచిన రహస్యమేంటి? తన సోదరి హంతకుడెవరో బేబీ కనిపెట్టి ప్రతీకారం తీర్చుకుందా? అనే ప్రశ్నలకు సమాధానం చిత్రాన్ని పూర్తిగా చూసినప్పుడే తెలుస్తుంది.
చిన్నప్పుడు కుటుంబ సభ్యులను ముసుగు వ్యక్తి హత్య చేయడం, పెద్దయ్యాక కొన్ని గుర్తుల ఆధారంగా అతణ్ని కనిపెట్టి ప్రతీకారం తీర్చుకోవడం వంటి అంశాలపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ హంతకుణ్ని కనిపెట్టే అన్వేషణ, ఆ క్రమంలో ప్రధాన పాత్ర ప్రదర్శించే తెలివితేటలు, విలన్, లీడ్ రోల్ మధ్య జరిగే దోబూచులాట కొత్తగా, ఉత్కంఠగా సాగితేనే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. ఈ చిత్రంలో ఆ ఉత్కంఠ లోపించింది.
మూగ, చెవిటి యువతి హంతకుణ్ని ఎలా పట్టుకుంటుందన్న ఆసక్తితో సినిమా మొదలవుతుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఆమె జనంలో కలిసిపోయి సైలెంట్‌గా హత్య చేసి, కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడం కొత్తగా అనిపించినా, ప్రతి రాత్రి సోదరి హత్యను గుర్తుచేసుకుంటూ ఉండటం తప్ప, హంతకుణ్ని కనిపెట్టడానికి ఆమె ఎలాంటి ప్రయత్నమూ చేయదు. చివరకు తన ప్రమేయం లేకుండానే, ఓ గుర్తు ద్వారా అతడెవరో తెలిసిపోతుంది. అప్పటికే ప్రేక్షకులు కూడా అతడెవరో అంచనా వేసి ఉంటారు. అందువల్ల సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తగ్గిపోతుంది.
క్లైమాక్స్ మరీ రొటీన్‌గా సాగుతుంది. విలన్ మొదట ప్రధాన పాత్రధారిని చచ్చేలా కొడతాడు. ఆ తరువాత సోదరి దారుణ హత్యను గుర్తుచేసుకున్న బేబీ ఒక్కసారిగా పైకి లేచి విలన్‌ను చంపి ప్రతీకారం తీర్చుకుంటుంది. బేబీ–సిద్ధూ లవ్ ట్రాక్ కథనానికి అడ్డుతగిలినట్లుగా, మరీ అసహజంగా అనిపిస్తుంది.
ముంబయి రియల్ ఎస్టేట్ దందా, ఓ వైపు మురికివాడలు, మరోవైపు ఆకాశహర్మ్యాలతో ఉన్న నగర వైరుధ్యాన్ని చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లక్కీ పాత్రలో అరుణ్ కుష్వా నటన వినోదాన్ని పంచుతుంది. ముగింపు సన్నివేశాల్లో జైన్ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ కొంత ఆసక్తిని కలిగిస్తుంది.
నటీనటుల పరంగా చూస్తే, ఒకట్రెండు సన్నివేశాలు తప్ప సినిమా ఆసాంతం హ్యూమా ఖురేషికి సంభాషణలు చాలా తక్కువ. సవాల్ ఉన్న ఈ పాత్రను ఆమె నమ్మకంగా పోషించారు. ప్రతినాయకుడిగా సికందర్ ఖేర్ తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. సీనియర్ నటుడు చుంకీ పాండేకు పెద్దగా స్కోప్ లేకపోయినా, తన పాత్రను సమర్థంగా చేశారు. అరుణ్ కుష్వాకు మరోసారి నవ్వులు పంచే పాత్ర దక్కింది. ఇతర పాత్రధారులు తమ పరిధిలో నటించారు.
కుటుంబంతో కలిసి చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి తెలుగు ఆడియో అందుబాటులో ఉంది.
బలాలు: హ్యూమా ఖురేషి, సికందర్ ఖేర్‌ల నటన; థ్రిల్ కలిగించే కాంట్రాక్ట్ కిల్లింగ్ సీన్లు; చివర్లో వచ్చే ట్విస్టు.
బలహీనతలు: కథనంలో ఉత్కంఠ లోపించడం; కథనానికి అడ్డుతగిలే లవ్ ట్రాక్.
మొత్తానికి, గట్టి థ్రిల్లింగ్ మూమెంట్స్ కోసం కాకుండా, కాలక్షేపానికి ఒకసారి చూడదగ్గ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘బేబీ డూ డై డూ’ నిలిచింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.







