రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: మలయాళ సినిమాలు ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. `ప్రేమమ్`, `మంజుమేల్ బాయ్స్` వంటి చిత్రాలు ఇక్కడ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. అదే తరహాలో `మంజుమేల్ బాయ్స్` దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా మలయాళ చిత్రం `బాలన్ ది బాయ్` ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిశేషన్, ఫర్జానా ఫలథింగల్, మహ్మాద్ జినాన్, జీన్ పాల్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో టోవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. వెంకట్ కె నారాయణ, శైలజ దేశాయ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో శుక్రవారం, జూన్ 19న విడుదలైంది.
కథ విషయానికి వస్తే… ఇందు పాత్రలో ఫర్జానా కనిపిస్తుంది. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. శిక్ష పూర్తయ్యాక తన కుమారుడు వసుదేవన్ (ఆదిశేషన్)తో కలిసి జైలు నుంచి బయటకు వస్తుంది. గతం గురించి ఎవరికి తెలియని ప్రాంతంలో కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం షెర్లీ, వందన, మేరీ వంటి మారుపేర్లతో పలు చోట్ల ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఎవరితోనూ బంధాలు, అనుబంధాలు ఏర్పరచుకోకుండా ఉండాలని చూస్తుంది.
చివరికి అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామంలో వృద్ధురాలికి కేర్‌టేకర్‌గా పని చేయడానికి చేరుతుంది. ఇందు ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్న ఆ వృద్ధురాలు, ఆమెతో పాటు వసుదేవన్ కూడా అక్కడే ఉండాలని కోరుతుంది. ఇందు తన కుమారుడిని సమీపంలోని పాఠశాలలో చేర్పిస్తుంది. ఇదిలా ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఇందు మరో హత్యకు పాల్పడాల్సి వస్తుంది. ఆ సంఘటనతో వసుదేవన్ తన తల్లికి దూరమవుతాడు. ఆ తర్వాత అతను క్రిమినల్ అబ్బాస్ (టోవినో థామస్) వద్దకు ఎలా చేరాడు? వసుదేవన్ కారణంగా పోలీస్ అధికారి పవిత్రన్ తన ప్రియురాలికి ఎలా దూరమయ్యాడు? వసుదేవన్ ఎప్పటికీ తన తల్లిని కలవకుండా ఉండేందుకు పవిత్రన్ ఎలాంటి కుట్రలు పన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
భర్తలేని మహిళలపై సమాజం చూపే తక్కువ చూపు, వారిపై మగాళ్ల దృష్టి, ఆ పరిస్థితుల్లో ఒక మహిళ తన కొడుకు కోసం, తన కోసం చేసే పోరాటం ఈ చిత్రానికి మూలాధారం. తల్లీకొడుకుల బంధాన్ని, వారి మధ్య ఉన్న భావోద్వేగాలను దర్శకుడు ఇంటెన్స్ థ్రిల్లర్ శైలిలో ఆవిష్కరించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పనిదొరకక ఇందు పడే ఇబ్బందులు, పేర్లు మార్చుకుంటూ తన అసలు గుర్తింపును దాచుకోవడం, భర్త ఉన్నాడని నమ్మించే ప్రయత్నం వంటి సన్నివేశాలు కదిలిస్తాయి. కొడుకును మానసికంగా సిద్ధం చేయడానికి ఆమె చెప్పే కథలు కూడా హృదయాన్ని తాకుతాయి.
వృద్ధురాలిని చూసుకునే కేర్‌టేకర్‌గా దూర గ్రామంలోని ఇంటికి వెళ్లిన తర్వాతే ఇందు అసలు జీవితం మొదలవుతుంది. అక్కడ తాను సెటిల్ అవుతుందనుకునే సమయంలో ముసలావిడ మరణించడం, జైల్లో ఉన్న మరో మహిళ తనని వెంటాడటం, ఆమెను చంపేయడం, ఆ తర్వాత ఇంటి యజమాని అకస్మాత్తుగా రావడం వంటి సంఘటనలు ఇందు జీవితాన్ని గందరగోళానికి గురిచేస్తాయి. దీంతో ఆమె తప్పుమీద తప్పు చేస్తూ తల్లీకొడుకుల్ని విడదీసే స్థితికి చేరుతుంది. ఈ భాగం థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగుతుంది.
పోలీస్ కానిస్టేబుల్ ప్రేమకథలో చిన్న పిల్లాడు కారణమై విరహం రావడం, దాన్ని మనసులో పెట్టుకుని అతను వసుదేవన్ తల్లిని ఇబ్బంది పెట్టడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. కథ ఒకే చోట తిరుగుతున్నట్టుగా అనిపించే డ్రై మోమెంట్స్ ఉన్నాయి. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, స్టార్ హీరో ఎంట్రీ సినిమా రేంజ్‌ని మార్చేస్తాయి. చివరి భాగం ప్రేక్షకులకు వేరే అనుభూతిని ఇస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే… ఇందు పాత్రలో ఫర్జానా ఫలథింగల్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్, ఇంటెన్స్, భయంతో కూడిన సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకి బలంగా నిలిచింది. బాలనటుడు ఆదిశేషన్ చిన్న వయసులో అమాయకత్వంతో, అందమైన హావభావాలతో ఆకట్టుకున్నాడు. పెద్దయ్యాక వసుదేవన్ పాత్రలో మహ్మాద్ జినాన్ నమ్మకంగా కనిపించాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా జీన్ పాల్ లాల్ నటన మరో హైలైట్. టోవినో థామస్ ఎంట్రీ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా పనిచేసింది.
టెక్నికల్‌గా చూస్తే… కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు తక్కువ. ఆర్ట్ ఫిల్మ్ ఛాయలు కనిపిస్తాయి. చిదంబరం తల్లీకొడుకుల బాండింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టి, ఎమోషనల్ థ్రిల్లర్‌గా కథను నిజాయితీగా తెరపైకి తీసుకువచ్చాడు. అయితే నెమ్మదిగా సాగే నేరేషన్ కొంత బోరింగ్‌గా అనిపించేలా చేస్తుంది. సైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, సుషీన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్రాణం పోశాయి. కాన్సెప్ట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకునే ఈ చిత్రానికి కమర్షియల్‌గా పెద్ద సత్తా చాటడం మాత్రం కష్టమే.
మొత్తానికి తల్లీకొడుకుల బంధాన్ని హృదయాన్ని కదిలించేలా చూపించిన ఎమోషనల్ థ్రిల్లర్‌గా `బాలన్ ది బాయ్` నిలిచింది. స్లో నేరేషన్‌ను పట్టించుకోకుండా భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే అవకాశం ఉంది.
రేటింగ్: 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)







