రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: ఈవారం పెద్ద సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించిన ప్రధాన తెలుగు చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కామెడీకి పెట్టింది పేరైన శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం, నక్సలైట్ ఉద్యమం నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, పూర్తిగా వినోదాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాగిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
90వ దశకంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో కథ నడుస్తుంది. తాడికొండ కళ్యాణ్ (శ్రీవిష్ణు) అనే యువకుడు గ్రామంలో థియేటర్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తుంటాడు. ఇదే సమయంలో అడవుల్లో నక్సలైట్ దళాల ఏరివేత కోసం ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) ప్రత్యేకంగా నియమితులవుతాడు. మాస్టార్ (సాయిచంద్) నేతృత్వంలోని దళం, జార్జ్‌కుట్టి మధ్య పోరాటం కొనసాగుతుండగా, ఆ ఊరికి ఒరియా అమ్మాయి సితారదేవి (మహిమా నంబియార్) తన తల్లిదండ్రులతో వస్తుంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న సితార తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్)ను కళ్యాణ్ కాపాడతాడు. సితారను చూసిన తొలి చూపులోనే అతనికి ప్రేమ పుడుతుంది. ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్న కళ్యాణ్, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉందని తెలుసుకుని, ఎలాగైనా వారిని గట్టెక్కించాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం తన స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) సాయంతో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ మార్గమే కళ్యాణ్ జీవితాన్ని అనుకోని మలుపు తిప్పి, థియేటర్ కళ్యాణ్‌ను ‘కామ్రేడ్ కళ్యాణ్’గా, పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారుస్తుంది. అడవిలోని నక్సలైట్ అన్నలతో కళ్యాణ్‌కు ఉన్న సంబంధం ఏమిటి, సితార కుటుంబాన్ని అతడు కష్టాల నుంచి బయటపడేశాడా, అన్నల–పోలీసుల మధ్య యుద్ధం ఎలా ముగిసింది అన్నదే చిత్ర కథ.
నక్సలైట్ దళాలు, పోలీసులు, ఏరివేత వంటి అంశాలు ఉండటంతో ఇది సీరియస్ డ్రామా అయి ఉంటుందేమో అనిపించినా, దర్శకుడు జానకిరామ్ మారెళ్ల కథను పూర్తిగా కామెడీ కోణంలో నడిపించాడు. ‘మాభూమి’ నుంచి ‘విరాటపర్వం’ వరకు నక్సలిజం నేపథ్యంపై వచ్చిన తెలుగు సినిమాలు ఎక్కువగా సంఘర్షణ, సిద్ధాంతాలపై చర్చను లేవనెత్తగా, ‘కామ్రేడ్ కళ్యాణ్’ మాత్రం ఆ నేపథ్యాన్ని వినోదానికి వేదికగా ఉపయోగించుకుంది.
ఆర్.నారాయణమూర్తి సినిమాలను గుర్తు చేసే ‘ఎత్తరా ఎత్తు...’ పాట తర్వాత నుంచే ఈ సినిమా తీసుకున్న దారి స్పష్టమవుతుంది. రాధికా శరత్‌కుమార్ బాలకృష్ణ అభిమానిగా చేసే సందడి, హీరో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఎపిసోడ్, హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆమెకు ప్రేమను చెప్పేందుకు హీరో పడే పాట్లు మొదలైనవి సరదాగా సాగినా, నవ్వుల మోతాదు మొదట్లో అంతగా అనిపించదు. దుబాయ్ బాబుగా సత్య ప్రవేశం తర్వాత మాత్రం హాస్యం బాగా పెరుగుతుంది. హీరో కోసం సత్య ఆంగ్లంలో రాసే ప్రేమలేఖ ఎపిసోడ్ నుంచి సినిమా మరింత సందడిగా మారుతుంది. బిశ్వాస్ పాత్రలో ఉపేంద్ర లిమాయే ఎంట్రీతో నవ్వులు కొనసాగుతాయి.
విరామానికి ముందు సాగే సన్నివేశాలు సినిమాకు కీలకం. అక్కడ అనూహ్యంగా చోటుచేసుకునే మలుపు కథను ఆసక్తికరంగా మార్చేస్తుంది. విరామం తర్వాత కథ అడవికి మారడంతో సీరియస్ టోన్ వస్తుందేమో అనిపించినా, అడవిలో అన్నలు, తుపాకులు, షూట్ అవుట్‌ల మధ్య కూడా హాస్యాన్ని పండించేలా రచన సాగింది. ఈ క్రమంలో కథ లాజిక్ పరంగా దూరమవుతున్నట్టుగా అనిపించినా, ప్రేక్షకులకు ఆ దిశగా ఆలోచించే సమయం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నవ్వులు పండించడం చిత్రానికి ప్లస్ పాయింట్.
ప్రథమార్థంలో ప్రేమలేఖ ఎపిసోడ్‌కు దీటుగా ద్వితీయార్థంలో వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ కలిసి మంచి కామెడీ చేశారు. 90ల కాలం నేపథ్యమైనా, ఆచార్య దళం, ప్యారడైజ్ కాకి వంటి వర్తమాన అంశాలను సంభాషణల్లోకి తీసుకువచ్చి హాస్యం పుట్టించే ప్రయత్నం చేశారు రచయితలు నందు, భాను, కోన వెంకట్. తారల రిఫరెన్సులు కూడా థియేటర్లలో సందడి చేయిస్తాయి. ఒక నాటకీయ మలుపు, చిన్న సందేశంతో సినిమా ముగిసినా, పతాక సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపవు.
కథానాయకుడిగా శ్రీవిష్ణు మరోసారి అలవోకగా పాత్రలో ఒదిగిపోయి, సుదర్శన్, సత్యతో కలిసి కడుపుబ్బా నవ్వించాడు. ఆలస్యంగా పరిచయమైనా సత్య పాత్ర చివరి వరకు కనిపించి హాస్యాన్ని కొనసాగిస్తుంది. మహిమా నంబియార్‌కు నటనకు పెద్ద అవకాశాలు లేకపోయినా, పాటల్లో ఆమె అందంగా కనిపించింది. సుదర్శన్, రాధికా శరత్‌కుమార్, బ్రహ్మాజీ, రఘుబాబు, ఉపేంద్ర లిమాయే, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, ప్రభాస్ శ్రీను, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు, సాయిచంద్, ముక్కు అవినాష్ తదితరులు తెరనిండా కనిపించి తమ తమ పాత్రలతో సినిమాపై బలమైన ప్రభావం చూపారు. షైన్ టామ్ చాకో పాత్ర మాత్రం అంతగా నిలబడలేదు.
సాంకేతికంగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కథకు తగ్గ ప్రపంచాన్ని స్పష్టంగా ఆవిష్కరించాడు. విజయ్ బుల్గానిన్ పాటలు బాగున్నాయి, నేపథ్య సంగీతం పరవాలేదనిపించే స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపించాయి. మొత్తానికి, హాస్యం, కథలో మలుపులు, శ్రీవిష్ణు నటన, బలమైన తారాగణం ఈ సినిమాకు బలాలు. వాస్తవికతకు దూరంగా వెళ్లే కథ, అంతగా ప్రభావం చూపని క్లైమాక్స్ బలహీనతలు. అయినప్పటికీ, ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రేక్షకులను మంచి స్థాయిలో నవ్వించే ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రివ్యూ : 2.5/5







