రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: దసరా సీజన్‌కి థియేటర్లలో సందడి మొదలైంది. ఈ పండగకు నేరుగా తెలుగు నుంచి ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ‘క్రేజీ కళ్యాణం’ ఒకటి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ వీకే, అఖిల్ రాజ్, కిరీటి తదితరులు నటించిన ఈ చిత్రానికి భద్రప్ప గాజుల రచన, దర్శకత్వం వహించగా, బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మాత. సురేశ్ బొబ్బిలి సంగీతం, శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ, శ్రవణ్ కటినేని ఎడిటింగ్ ఈ చిత్రానికి బలంగా నిలిచాయి. అక్టోబర్ 16, 2026న సినిమా విడుదలైంది.
కథ తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. పర్వతాలు (నరేశ్ వీకే)కి ఇద్దరు కూతుళ్లు. అన్న చూసిన సంబంధం అని పెద్ద కూతుర్ని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు. కానీ బాలరాజు తాగుడుకు బానిసై ఊరిలో అప్పులు చేసి, ఇంటిపైకి గొడవలు తెచ్చే వ్యక్తిగా మారతాడు. దీంతో పర్వతాలు ఊరిలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొంటాడు. ఈ నేపథ్యంలో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి గుణగణాలు, ఆస్తిపాస్తులున్న అబ్బాయిని చూసి ఘనంగా పెళ్లి చేసి, తన పరువును కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు.
తన అన్న కూతురుకి వచ్చిన యూఎస్ సంబంధాన్ని చెడగొట్టి మరీ ఆ అబ్బాయిని కీర్తికి పెళ్లి చేయాలని పర్వతాలు సిద్ధపడతాడు. కానీ కీర్తి ఆలోచనలు వేరు. స్వతంత్ర భావాలున్న ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్)ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పినా, పర్వతాలు ఊరి గౌరవం, మర్యాదల పేరుతో యూఎస్ సంబంధాన్నే చేసుకోవాలని పట్టుబడతాడు. తండ్రి ఆశలు, కూతురు ఆత్మస్థైర్యం మధ్య జరిగే సంఘర్షణ, దాని వల్ల కలిగే పరిణామాలే మిగతా కథ.
దర్శకుడు భద్రప్ప గాజుల తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని, ప్రేమకథను ముడిపెట్టి ఓ రూరల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ప్రతి తండ్రి తన కూతురి పెళ్లికి పెట్టే ఖర్చులో పదో వంతు వారి చదువులకు పెట్టినా వారి జీవితాలు బాగుపడతాయని, తల్లిదండ్రులు ఆ కోణంలో ఆలోచించాలనే సందేశాన్ని ఈ సినిమాతో అందించాలనుకున్నట్టు కథనం స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఈ మంచి పాయింట్‌కి తగ్గట్టుగా కథా నిర్మాణం, స్క్రీన్‌ప్లే పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ప్రథమార్ధంలో పర్వతాలు కుటుంబం, తాగుబోతు అల్లుడు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను చూపిస్తూ సినిమా ఫన్ టోన్‌లో సాగుతుంది. వెంటనే కీర్తి–ఉదయ్ ప్రేమకథ తెరపైకి వస్తుంది. ఈ లవ్ ట్రాక్‌లో కొత్తదనం, భావోద్వేగం రెండూ కొరవడినట్టు అనిపిస్తుంది. పర్వతాలు తన అన్న కూతురి ఎన్నారై సంబంధాన్ని కీర్తికి సెట్ చేసే దగ్గర నుంచి కథలో కాస్త కదలిక మొదలైనా, కీర్తి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునేలా ఉండవు. విరామ ఘట్టాలు మాత్రం భావోద్వేగభరితంగా ఫర్వాలేదనిపిస్తాయి.
ద్వితీయార్ధంలో కథ గాడి తప్పినట్టు అనిపిస్తుంది. కూతుర్ని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనే పర్వతాలు ప్రయత్నాల్లో సీరియస్‌నెస్ కనిపించినా, ఆ పెళ్లిని అడ్డుకునేందుకు నాయికానాయకులు చేసే ప్రయత్నాలు బలమైన సంఘర్షణను సృష్టించలేవు. ఫన్ కోసం క్రియేట్ చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ భావోద్వేగభరితంగా మారుతుంది. ఒక వైపు కూతురి పెళ్లి ఆగకూడదని పర్వతాలు పడే తపన మనసును హత్తుకుంటే, మరో వైపు పెళ్లి వేడుకలో జరిగే గొడవ, బాలరాజ్ చేసే యాక్షన్ హంగామా థ్రిల్ పంచుతుంది. క్లైమాక్స్ కొద్దిగా గందరగోళంగా అనిపించినా, ఆడపిల్లకి చదువు ముఖ్యం అనే సందేశంతో సినిమాను ముగించిన తీరు బాగుంది.
నటీనటుల్లో కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటన ప్రధాన బలం. తెలంగాణ యాసను సహజంగా పలుకుతూ, భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో కట్టిపడేసింది. ఉదయ్ పాత్రలో అఖిల్ రాజ్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. పర్వతాలు పాత్రలో నరేశ్ వీకే అభినయం చిత్రానికి అసలైన ఆకర్షణ. మధ్యతరగతి తండ్రిగా ఆయన చూపిన కామెడీ, ఎమోషనల్ నటన సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. బాలరాజ్‌గా తరుణ్ భాస్కర్ తనదైన బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో నవ్వులు పంచాడు.
సాంకేతికంగా చూస్తే, సురేశ్ బొబ్బిలి సంగీతం సరాసరి స్థాయిలో ఉంది. ‘అలచంద్ర వంక’ పాట మినహా ఇతర గీతాలు పెద్దగా గుర్తుండేలా లేవు. శ్యామ్ దూపాటి కెమెరా పనితనం పల్లెటూరి వాతావరణం, పెళ్లి కళను అద్భుతంగా చూపించింది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి.
మొత్తానికి ‘క్రేజీ కళ్యాణం’లో అనుపమ, నరేశ్ నటన, ఫాదర్ ఎమోషన్ బలాలుగా నిలిస్తే, కొత్తదనం లేని కథ, నాయకానాయికల లవ్ ట్రాక్ బలహీనతలుగా మారాయి. సందడి తగ్గిన కళ్యాణంలా అనిపించినా, ఆడపిల్ల చదువుపై పెట్టిన దృష్టి, తండ్రి–కూతుళ్ల భావోద్వేగం కొంతమేర ప్రేక్షకులను తాకేలా ఉన్నాయి.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 2/5






