‘దృఢం’ – ఊహించని క్లైమాక్స్‌తో థ్రిల్‌ పంచిన మలయాళ క్రైమ్‌ మిస్టరీ

మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘దృఢం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్టిన్‌ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. షేన్‌ నిగమ్‌, శోభి తిలకన్‌, కొట్టాయం రమేశ్‌, దినేశ్‌ ప్రభాకర్‌, నందన్‌ ఉన్ని, వినోద్‌ బోస్‌, కృష్ణ ప్రభ, సానియా ఫాతిమా, మాథ్యూ వర్గీస్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

కథలోకి వెళ్తే… శిక్షణ పూర్తిచేసుకున్న విజయ్‌ అనే యువకుడు కుజినీలం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా మొదటిసారి హాజరవుతాడు. ఆ ఊరు, పరిసర ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్టేషన్‌లో పనిచేసే పోలీసులందరూ కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అయితే విజయ్‌ బాధ్యతలు చేపట్టిన రెండో రోజుకే ఊరి చివరన గుర్తుపట్టలేని స్థితిలో ఓ శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన మరుసటి రోజే స్థానిక ఫైనాన్స్‌ కంపెనీలో భారీ దోపిడీ జరుగుతుంది. 120 సవర్ల బంగారం, రూ.50 లక్షల నగదు అపహరించబడుతుంది.

శాంతియుతంగా ఉండే ఊరిలో వరుసగా జరిగే ఈ సంఘటనలు కుజినీలం ప్రాంతాన్ని ఒక్కసారిగా వార్తల్లోకి తెస్తాయి. ఇదే సమయంలో డ్యామ్‌ దగ్గర మరో శవం బయటపడటంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఈ కేసులను ఏకకాలంలో ఛేదించాలని ఉన్నతాధికారులు ఎస్సై విజయ్‌పై ఒత్తిడి పెంచుతారు. వారం రోజుల్లో కేసులు పరిష్కరించకపోతే బాధ్యతలు మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. ఆధారాలు దొరకక విజయ్‌ తలపట్టుకునే స్థితికి చేరతాడు. ఈ శవాలు ఎవరివి? హత్యలేనా? ఫైనాన్స్‌ కంపెనీ దోపిడీకి ఎవరు కారణం? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయాణమే మిగతా కథ.

క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌లలో కథను, విచారణ ప్రక్రియను తెరపై ఎలా చూపిస్తారన్నదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ కోణంలో మార్టిన్‌ జోసెఫ్‌ పనితనం బాగానే మెప్పిస్తుంది. కొత్తగా ఎస్సైగా చేరిన యువకుడిని చుట్టుముట్టిన కేసులను ఆధారంగా తీసుకుని, కథను ఆద్యంతం ఉత్కంఠగా నడిపించాడు. విజయ్‌ వ్యక్తిత్వం, ప్రశాంతమైన కుజినీలం వాతావరణం, అక్కడి పోలీస్‌స్టేషన్‌లో సహచరుల మధ్య స్నేహభావం వంటి సన్నివేశాలతో ముందుగా కథా ప్రపంచాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేస్తాడు. మొదటి శవం బయటపడిన దగ్గర నుంచి అసలు కథ పట్టాలెక్కుతుంది.

ఫైనాన్స్‌ కంపెనీ దోపిడీ ఎపిసోడ్‌తో కథ వేగం పెరుగుతుంది. ఇక్కడి నుంచి మొదలయ్యే ఇన్వెస్టిగేషన్‌, ఆధారాల కోసం విజయ్‌ అండ్‌ టీమ్‌ చేసే ప్రయత్నాలు కొంతవరకు రొటీన్‌గా అనిపించినా, మధ్య మధ్యలో వచ్చే కొత్త సమస్యలు, విజయ్‌ను చుట్టుముట్టే తలనొప్పులు ఆసక్తిని పెంచుతాయి. హంతకుడిని పట్టుకునే క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతాయి. రెప్పపాటులో హంతకుడిని తప్పించి, ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచేలా దర్శకుడు నడిపాడు.

ఉన్నతాధికారుల ఒత్తిడి, ఊరి ప్రజల ఆందోళనల మధ్య విజయ్‌ ఒక దశలో డీలా పడిపోతాడు. అయినా తన మొదటి కేసును ఎలాగైనా ఛేదించాలన్న దృఢ సంకల్పంతో తప్పు ఎక్కడ జరుగుతుందో వెతుక్కుంటూ వెళ్లే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రీక్లైమాక్స్‌ దగ్గర ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుడిని సర్‌ప్రైజ్‌ చేస్తాడు దర్శకుడు. వెంట వెంటనే మరో రెండు ట్విస్ట్‌లు జోడించి థ్రిల్‌ను మరింత పెంచాడు. చివరి 20 నిమిషాల్లో సాగే యాక్షన్‌ ఎపిసోడ్‌, నిందితులపై విజయ్‌ చేసే పోరాటం ఆకట్టుకుంటాయి. పోలీస్‌స్టేషన్‌ బోర్డును చూపిస్తూ ‘దృఢం’ టైటిల్‌ మీదుగా జూమ్‌ అవుట్‌ అయ్యే చివరి సీన్‌ కథ, కథానాయకుడి పాత్రకు మంచి ముగింపు ఇస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే… మలయాళ డబ్బింగ్‌ చిత్రాల ద్వారా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన షేన్‌ నిగమ్‌ ఎస్సై విజయ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. కేసును ఛేదించలేక తనలో తానే మథనపడే సన్నివేశాల్లో, క్లైమాక్స్‌లో నమ్మకద్రోహం ఎదురైనప్పుడు ఆయన నటన బాగుంది. మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, కథపై వారి ప్రభావం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్‌ కానిస్టేబుళ్లుగా నటించినవారు థ్రిల్‌ పంచారు.

సాంకేతికంగా కూడా చిత్రం బాగానే నిలిచింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు డెప్త్‌ తీసుకొచ్చింది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉండటంతో సుమారు రెండు గంటల నిడివి ఉన్న సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాగుతుంది. ఆరంభం కాస్త నెమ్మదిగా అనిపించినా, చివరికి సాధారణ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లకు భిన్నంగా ట్విస్ట్‌లు జోడించి దర్శకుడు మార్టిన్‌ జోసెఫ్‌ చక్కటి అనుభూతిని అందించాడు.

దాదాపు రూ.3 కోట్లతో నిర్మించిన ‘దృఢం’ బాక్సాఫీస్‌ వద్ద రూ.8 కోట్లు వసూలు చేయడం విశేషం. కుటుంబంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగిన ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

బలాల విషయానికి వస్తే – కథ, కథనం, దర్శకత్వం, నటీనటుల ప్రదర్శన ప్రధాన ఆకర్షణలు. బలహీనతలుగా కొన్ని సబ్‌ప్లాట్స్‌, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు కొద్దిగా నెమ్మదిగా అనిపించడం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఊహించని క్లైమాక్స్‌తో థ్రిల్‌ పంచే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ‘దృఢం’ ఓ మంచి ఎంపికగా నిలుస్తుంది.

రేటింగ్:- 2.75/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)