రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ:- హిందీ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’మలయాళ ‘దృశ్యం3’కి భిన్నంగా
మలయాళంలో మొదలైన ‘దృశ్యం’ క్రైమ్ థ్రిల్లర్ ప్రయాణం పలు భాషల్లో రీమేక్‌ల రూపంలో కొనసాగి, భారతీయ సినీ ప్రేక్షకులకు ఉత్కంఠభరిత అనుభూతి పంచింది. హిందీలో ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకాదరణ పొందగా, మూడో భాగం ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ ‘దృశ్యం3’తో పోలిస్తే ఇందులో చేసిన మార్పులు, కథనంలో తీసుకున్న కొత్త మలుపులు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
కథలోకి వెళ్తే.. ఐజీ మీరా దేశ్‌ముఖ్ (టబు), మహేశ్ దేశ్‌ముఖ్ (రజత్ కపూర్)ల కుమారుడు సమీర్ హత్యకు సంబంధించి న్యాయస్థానం తుది తీర్పు కోసం విజయ్ సాల్గాంకర్ (అజయ్ దేవగణ్) కుటుంబం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఉన్న ఆధారాలన్నీ విజయ్‌కు అనుకూలంగా ఉండటంతో, ఈ కేసు నుంచి బయటపడతామనే ఆశ కుటుంబంలో ఉంటుంది. మరోవైపు కొడుకును కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని మీరా ఆత్మహత్యకు యత్నించగా, భర్త మహేశ్ ఆమెను ఆపి, ఎలాగైనా విజయ్ కుటుంబం చేసిన నేరాన్ని నిరూపిస్తానని హామీ ఇస్తాడు.
ఆ తర్వాత మహేశ్ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమార్ (జైదీప్ అహ్లావత్)ను సంప్రదిస్తాడు. అతడు విభాగంలో అత్యంత కఠినమైన కేసులను కూడా ఛేదించే అధికారిగా పేరుపొందాడు. కోర్టు తుది తీర్పు వెలువడేలోపు సమీర్ హత్య కేసును మరోసారి దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. విజయ్‌కు వ్యతిరేకంగా రాజ్‌వీర్ ఏ ఆధారాలు సేకరించాడు? వాటిని కోర్టులో నిరూపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంద్రసేన్ శెట్టి (ప్రకాశ్‌రాజ్) ఏ విధంగా వాదనలు వినిపించాడు? విజయ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతదూరం వెళ్లాడు? అనుకోకుండా జరిగిన సమీర్ హత్యకు ఈ కథతో నిజంగా ముగింపు లభించిందా? అన్నది తెలుసుకోవాలంటే ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ను చూడాల్సిందే.
సమీర్ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించే క్రమంలో ఇంద్రసేన్ శెట్టి, ఎస్పీ రాజ్‌వీర్, మాజీ ఐజీ మీరా, ఆమె భర్త మహేశ్‌లు కలిసి సమావేశం నిర్వహించే సన్నివేశం కీలకంగా నిలుస్తుంది.
‘నేను బెంగళూరులో ఎల్‌ఎల్‌ఎం చేశా. ఎస్పీ క్రిమినాలజీలో పీజీ చేశారు. మీరా సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.. మహేశ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇంత పెద్ద చదువులు చదువుకున్న మనం ఒక నాలుగో తరగతి కూడా పాస్ అవ్వని విజయ్‌ను అడ్డుకునేందుకు చేతులు కలిపాం’
అని ఇంద్రసేన్ శెట్టి విజయ్‌ను ఎగతాళి చేసే విధానం, ఒక సామాన్యుడు తన కుటుంబం కోసం ఎంతవరకు పోరాడతాడో చూపించే విజయ్ పాత్ర, ఇవన్నీ కలిసి చిత్రానికి బలాన్ని ఇస్తాయి.
మీరా మానసిక స్థితిని చూపించిన తర్వాత, ఆమె భర్త ఇచ్చే హామీతో కథను కొత్త ట్రాక్ ఎక్కించిన దర్శకుడు అభిషేక్ పాఠక్, ఎస్పీ రాజ్‌వీర్ పాత్రను ప్రవేశపెట్టి దర్యాప్తు కోణాన్ని నెమ్మదిగా ఆవిష్కరిస్తూ వెళ్లాడు. ప్రారంభ సన్నివేశాలు కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నాయనే భావన కలిగించినా, ఎస్పీ ఒక్కో ఆధారాన్ని మళ్లీ సేకరించడం, విజయ్ కుటుంబంపై నిఘా పెట్టడం వంటి అంశాలతో అసలు కథకు అవసరమైన మసాలాను సిద్ధం చేశాడు.
విజయ్ పెద్ద కుమార్తె అంజు (ఇషితా దత్త) పెళ్లి చూపులు జరుగుతున్న సమయంలో ఎస్పీ రాజ్‌వీర్ వారి ఇంటికి వెళ్లి ఆ సందర్భాన్ని చెడగొట్టడం, ఈ క్రమంలో ఎస్పీ–విజయ్‌ల మధ్య జరిగే ఫేస్ ఆఫ్ తర్వాత వచ్చే విరామం ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. అక్కడి నుంచి కోర్టు రూమ్ డ్రామా ఒకవైపు, సమీర్ అస్తిపంజరం స్థానంలో పెట్టిన యువకుడి సమాధిని తవ్వేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, చర్చి చుట్టూ నడిచే సంఘటనలు మరోవైపు సాగుతాయి. ప్రథమార్ధంలో కనిపించిన అనేక సన్నివేశాలకు ఇక్కడ పే ఆఫ్ లభించేలా కథనం నడుస్తుంది.
ఒక్కో ఆధారాన్ని బయటపెడుతూ కోర్టులో ఇంద్రసేన్ శెట్టి వినిపించే వాదనలు వింటే విజయ్ చిక్కుకున్నాడేమో అనిపించేలా ఉంటాయి. అయితే ఆ తర్వాత వచ్చే మలుపులు ప్రేక్షకుడికి కొత్త థ్రిల్ పంచుతాయి. ముఖ్యంగా విజయ్ భార్య నందిని (శ్రియ) ఇచ్చే ట్విస్ట్, సమాధిలో ఉన్న అస్తిపంజరం గురించి క్లైమాక్స్‌లో బయటపడే నిజం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి.
అజయ్ దేవగణ్ విజయ్ పాత్రలో మరోసారి సటిల్డ్ నటనతో ఆకట్టుకున్నారు. శ్రియ నందినిగా క్లైమాక్స్‌లో కీలక మలుపు ఇస్తుంది. ఎస్పీ రాజ్‌వీర్‌గా జైదీప్ అహ్లావత్ గంభీరమైన హాజరు చూపించినా, చివరికి విజయ్ ప్లానింగ్ ముందు అతడి ప్రయత్నాలు తేలిపోయినట్లు అనిపిస్తుంది. టబు, రజత్ కపూర్ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులుగా ఒదిగిపోయారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రకాశ్‌రాజ్ తన నటన, వాగ్ధాటితో చిత్రానికి మరింత బలం చేకూర్చారు. మిగిలిన నటులు తమ పరిధిలో బాగా చేశారు.
సాంకేతికంగా సినిమా బలంగా నిలిచింది. నేపథ్య సంగీతం అనేక సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఈ కథకు నిజమైన హీరో దర్శక–రచయిత అభిషేక్ పాఠక్. మలయాళ ‘దృశ్యం3’కి పూర్తి భిన్నమైన కథను ఎంచుకుని, సాగదీత లేకుండా క్రైమ్ స్టోరీలో థ్రిల్‌ను సమర్థంగా కలిపాడు. ముఖ్యంగా ద్వితీయార్ధం పరుగులు పెట్టేలా చేసి, క్లైమాక్స్‌తో హిందీ ‘దృశ్యం’ సిరీస్‌కు సరైన ముగింపు ఇచ్చాడు.
బలాలు: కథ, కథనం; నటీనటుల నటన; దర్శకత్వం; ద్వితీయార్ధం, క్లైమాక్స్ ట్విస్ట్.
బలహీనత: నెమ్మదిగా సాగే ఆరంభ సన్నివేశాలు.
మొత్తం మీద ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ హిందీ ‘దృశ్యం’ ప్రయాణానికి థ్రిల్లింగ్, పర్‌ఫెక్ట్ ఎండ్‌గా నిలిచింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 3/5







