రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ:- దుల్కర్ సల్మాన్ ‘ఐమ్ గేమ్’ – కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన థ్రిల్లర్
మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐమ్ గేమ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడైన దుల్కర్ వరుసగా తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నహాస్ హిదయత్ కథ, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఖయాదు లోహర్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కథిర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ, చమన్ చాకో ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక బలాలు. నిర్మాతలుగా దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వ్యవహరించారు.
కథ పరంగా చూస్తే, డ్యాన్ జాన్ అనే యువకుడి జీవితమే ఈ సినిమా మూలకథ. చదువు పూర్తయ్యాక తండ్రి కోరిక మేరకు వ్యాపారం చూసుకుంటున్న డ్యాన్‌కు అసలు ఆసక్తి మాత్రం గ్యాంబ్లింగ్‌పైనే ఉంటుంది. లక్షల్లో నష్టపోయినా ఆగకుండా అప్పులు తెచ్చి జూదం ఆడే స్థాయికి చేరతాడు. అప్పులవాళ్ల వేధింపులు పెరగడంతో తల్లి మెర్సీ దాచుకున్న రూ.60 లక్షలు కూడా అతనికి ఇస్తుంది. ఆ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్ ఆడిన డ్యాన్ మొత్తం కోల్పోతాడు. బెట్టింగ్ నిర్వాహకులను బెదిరించి డబ్బులు తీసుకుని కారులో పారిపోతుండగా జరిగిన ప్రమాదంలో కుడిచేయి కోల్పోతాడు.
ఆపరేషన్ ద్వారా డ్యాన్ చేతికి మరో వ్యక్తి చేయి అమర్చుతారు. ఈ సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఇషా పరిచయమవుతుంది. మొదట్లో అన్నీ సవ్యంగానే ఉన్నట్టు అనిపించినా, క్రమంగా ఆ కుడిచేయి తన నియంత్రణలో లేదని డ్యాన్ గ్రహిస్తాడు. తాను ఆపాలనుకున్నా, ఆ చేయి తన ఇష్టానుసారం పనులు చేయడం మొదలుపెడుతుంది. మొదట భయపడిన డ్యాన్ ఆ తర్వాత ఆ పరిస్థితికి అలవాటు పడతాడు. ఒక రోజు బెట్టింగ్ సెంటర్‌లో మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన డేవిడ్‌ను చూసిన వెంటనే ఆ చేయి కత్తి తీసుకుని అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. డ్యాన్ ఎంతో కష్టపడి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఆ చేయి ఎవరిది? డేవిడ్‌ను ఎందుకు చంపాలనుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం కోసం కథ ముందుకు సాగుతుంది.
కథన నిర్మాణంలో దర్శకుడు నహాస్ హిదయత్ ఎంచుకున్న పాయింట్ కొత్తదనంగా కనిపిస్తుంది. ఆత్మలు, మల్టీపుల్ డిజార్టర్ పర్సనాలిటీ వంటి కాన్సెప్ట్‌లతో వచ్చిన పాత సినిమాలకంటే భిన్నంగా, చేతి ప్రవర్తన చుట్టూ కథను నడిపించే ప్రయత్నం చేశారు. డ్యాన్ జీవనశైలి, జూదానికి బానిస కావడం, అప్పుల బారిన పడటం వంటి ప్రారంభ సన్నివేశాలు పాత్ర స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తూ ప్రేక్షకుడిని కథా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. డ్యాన్ చేతికి సర్జరీ జరిగి, ఆ చేయి తన నియంత్రణలో లేదన్న విషయం బయటపడే వరకు కథలో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా, ఆ తర్వాతి సన్నివేశాలు వినోదాత్మకంగా, థ్రిల్లింగ్‌గా సాగుతాయి.
డ్యాన్ మాట వినకుండా కుడిచేయి చేసే చేష్టలు మంచి వినోదాన్ని పంచుతాయి. డేవిడ్‌పై హత్యా ప్రయత్నం తర్వాత డ్యాన్ తీసుకునే నిర్ణయం, ఆ తర్వాత కుడిచేయి చూపించే విశ్వరూపం విరామానికి ముందు ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా డ్యాన్–కుడిచేయి మధ్య జరిగే అంతర్గత సంఘర్షణను తెరపై చూపించిన తీరు భిన్నంగా ఉంటుంది. విరామం తర్వాత డ్యాన్ ఆ చేయి ఎవరిదో తెలుసుకునే ప్రయత్నాలతో ద్వితీయార్ధం మొదలవుతుంది. విక్కీ ఫ్లాష్ బ్యాక్ వచ్చే వరకు ఆసక్తి నిలుస్తుంది. అయితే విక్కీ గతం, క్రికెట్ నేపథ్య సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. డేవిడ్ పాత్రలోనూ పెద్దగా కొత్తదనం కనిపించదు. విక్కీ ఫ్లాష్ బ్యాక్‌లో భావోద్వేగం సరిగా పండకపోవడంతో అక్కడి సన్నివేశాలు కొంత సాగదీతగా అనిపిస్తాయి.
మళ్లీ వర్తమానంలోకి వచ్చిన తర్వాత కథ గాడిన పడుతుంది. క్లైమాక్స్‌లో డ్యాన్, కుడిచేయి కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నటన పరంగా దుల్కర్ సల్మాన్ డ్యాన్ జాన్ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రారంభంలో స్టైలిష్‌గా కనిపించిన ఆయన, తర్వాత కుడిచేయిని నియంత్రించలేని వ్యక్తిగా, తన చేతితోనే తాను పోరాడే సన్నివేశాల్లో మంచి నటన చూపించాడు. ఆంటోనీ వర్గీస్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిస్కిన్ సాధారణ విలన్‌గా కనిపించాడు. కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్ తమ పాత్రల పరిధిలోనే నటించారు.
సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. జేక్స్ బిజోయ్ సంగీతం అనేక సన్నివేశాలను ఎలివేట్ చేసింది. జిమ్షీ ఖలీద్ చిత్రీకరణ, చమన్ చాకో ఎడిటింగ్ పనితనం సంతృప్తికరంగా ఉన్నాయి. అయితే నిడివి విషయంలో కొంత కత్తెర వేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా మరింత కట్టుదిట్టంగా అనిపించేదనే భావన కలుగుతుంది. దర్శకుడు నహాస్ హిదయత్ ఎంచుకున్న పాయింట్‌లో కొత్తదనం ఉన్నప్పటికీ, డ్యాన్, అతడి కుడిచేయి నేపథ్యంలో మరికొన్ని సన్నివేశాలను మెరుగుపరచి, ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని కుదించి ఉంటే చిత్రం మరింత ప్రభావవంతంగా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తం మీద ‘ఐమ్ గేమ్’లో ప్రథమార్ధం, విరామానికి ముందు సన్నివేశాలు, దుల్కర్ సల్మాన్ నటన ప్రధాన బలాలుగా నిలిచాయి. ద్వితీయార్ధంలో కొన్ని రొటీన్ సన్నివేశాలు, నిడివి మాత్రం బలహీనతలుగా కనిపిస్తున్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో దూకుడు చూపించిన ఈ చిత్రం, రెండో ఇన్నింగ్స్‌లో ఆ ఉత్సాహాన్ని పూర్తిగా కొనసాగించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రేటింగ్:- 2.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.







