రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ ‘గుడ్ టైమ్’ సినిమా : చిన్న బడ్జెట్‌తో మంచి ప్రయత్నం
ఎకో క్రాఫ్ట్ మీడియా బ్యానర్‌పై చాణక్య జిల్లా దర్శకత్వంలో, రమేష్ జిల్లా నిర్మించిన ‘గుడ్ టైమ్’ సినిమా అక్టోబర్ 9, 2026న విడుదలైంది. నిఖిల్ గాజుల, అన్యుక్త నల్లాని హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సౌందర్య లహరి, ఎం సి హరి, హృతిక్ శెట్టి, జెమినీ సురేష్, సునీత మనోహర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. నిర్వాన్ ఆత్రేయ సంగీతం, అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ, తరుణ్ రెడ్డి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక బలాలు.
ఆదర్శ కుటుంబం వంటి పెద్ద సినిమా రిలీజ్‌కి దూరంగా నిలవడంతో, ఆ ఖాళీని వినియోగించుకోవడానికి పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ప్రమోషనల్ కంటెంట్‌తో ముందే ఆసక్తి రేపిన ‘గుడ్ టైమ్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ
జానకి రామ్ అలియాస్ జానీ (నిఖిల్ గాజుల) మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఇంటర్ తర్వాత చదువును వదిలేసి క్యాబ్ డ్రైవర్‌గా పని మొదలుపెడతాడు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో అప్పుల బాధ్యత మొత్తం తల్లి (సునీత మనోహర్) భుజాలపై పడుతుంది. జానీ మాత్రం సంపాదించిన డబ్బంతా బెట్టింగుల్లో ఖర్చు చేస్తూ అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో సంపాదించినదంతా కోల్పోతూ ఉంటాడు.
ఇదిలా ఉండగా క్రిస్టియన్ అమ్మాయి నిశ్చల (అన్యుక్త నల్లాని)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన సామర్థ్యానికి మించి ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు ఇస్తూ, బైక్ రైడర్ గంగ (ఎం సి హరి) వద్ద లక్షల్లో అప్పులు చేస్తుంటాడు. ఒక రోజు జానీ వల్ల గంగ అహంకారం దెబ్బతింటుంది. దీంతో అప్పు వెంటనే తీర్చాలని అతనిపై ఒత్తిడి పెంచుతాడు. ఇదే సమయంలో జానీ తల్లి కూడా అనుకోని కారణాలతో అప్పుల బారిన పడుతుంది.
ఈ సమస్యల నుంచి జానీ, అతని కుటుంబం ఎలా బయటపడ్డారు? రుక్మిణి (సౌందర్య లహరి) ఎంట్రీతో జానీ జీవితంలో ఏ మార్పులు వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
నటీనటుల ప్రదర్శన
ఈ సినిమాలో తెలిసిన ముఖాలు చాలా తక్కువ. జెమినీ సురేష్, సునీత మనోహర్ తప్ప మిగతా వారంతా దాదాపు కొత్తవారే. అయినప్పటికీ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. నిఖిల్ గాజుల జానీ పాత్రను సులభంగా మోసాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. అన్యుక్త నల్లాని మొదటి సినిమాతోనే గ్లామర్, ఎక్స్‌ప్రెషన్స్ రెండింటితోనూ ఆకట్టుకుంది.
తల్లి పాత్రలో సునీత మనోహర్ తనదైన శైలిలో నటించి, అవసరమైన చోట్ల కామెడీ కూడా పండించింది. గోదావరి యాసతో పాపులర్ అయిన జెమినీ సురేష్ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాడు. అది అతనికి అంతగా సరిపోలలేదు. ఉత్తేజ్‌కు సరిగ్గా సరిపోయే పాత్రను అతనితో చేయించారేమో అనిపిస్తుంది. రుక్మిణి పాత్రలో సౌందర్య లహరి తక్కువ సేపు కనిపించినా బాగానే అనిపించింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, ‘అమీర్ లోగ్’ ఫేమ్ ఎం సి హరి తమ పాత్రలను సమర్థంగా చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఇటీవల హైదరాబాదీ నేపథ్యంతో వచ్చే సినిమాల జాబితాలో ‘ఫలక్‌నుమా దాస్’, ‘దీవానా’, ‘అమీర్ లోగ్’, ‘ది ప్యారడైజ్’ తర్వాత ఇప్పుడు ‘గుడ్ టైమ్’ కూడా చేరింది. జెన్–జి యువతను దృష్టిలో పెట్టుకుని చాణక్య జిల్లా ఈ కథను తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. నేటితరం యువతలో ఉన్న ఆసక్తి, వెంటనే అన్నీ దక్కించుకోవాలనే తొందర, ఎక్కువ డబ్బు కోసం గ్యాంబ్లింగ్ వంటి అడ్డదారులు ఎంచుకోవడం, అమ్మాయిల కోసం, ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం అప్పులు చేసి చిక్కుల్లో పడటం, ఆ ఒత్తిడిలో మాదకద్రవ్యాలకు బానిసవడం వంటి మూడు ప్రధాన అంశాలపై దర్శకుడు దృష్టి పెట్టాడు. లైన్ మంచి దే.
ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా సాగి, ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్లలో కనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో టేకింగ్ కొంత గాడితప్పిన భావన కలుగుతుంది. మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య సమతుల్యం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో విలన్‌తో బైక్ రేసింగ్ ఎపిసోడ్ పెట్టారు. దానికి ముందు హీరో, విలన్‌ను పెద్ద స్థాయిలో ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఆ రేసులో ఎవరు గెలిచారు, అక్కడ ఏమైంది అన్నది స్పష్టంగా చూపించలేదు.
క్లైమాక్స్‌లో రుక్మిణి ట్రాక్ బాగా నడిచింది. హీరోకి ఆమె తండ్రి చెప్పే తాత్విక మాటలు ఆలోచింపజేస్తాయి, నవ్విస్తాయి, అలాగే ఒక మంచి ముగింపు ఇచ్చిన భావన కలిగిస్తాయి. అయితే ఆ తర్వాత హీరో దుబాయ్‌కి వెళ్లినట్టు చూపించడం అవసరం లేనట్టే అనిపిస్తుంది.
ఇవి పక్కన పెడితే, ఇటీవలి కాలంలో చిన్న సినిమా ఇంత క్వాలిటీతో రావడం అరుదు. ‘గుడ్ టైమ్’ నిర్మాతలు ఈ విషయంలో మంచి జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో కొంత ట్రిమ్ చేస్తే ఇంకా బెటర్‌గా ఉండేది. ముఖ్యంగా బైక్ రేసింగ్ ఎపిసోడ్‌కి సరైన ముగింపు ఇచ్చే కొన్ని విజువల్స్ జోడిస్తే మంచిది. థియేటర్ వెర్షన్ కాకపోయినా, ఓటీటీ వెర్షన్ కోసం అయినా ఈ సవరణలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
ముగింపు – రేటింగ్
ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులను ‘గుడ్ టైమ్’ కొంతవరకు ఎంటర్‌టైన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకాస్త బలంగా ఉంటే సినిమా మొత్తం ఇంపాక్ట్ మరింత పెరిగేది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మరింత ప్రశంసలు దక్కే అవకాశం ఉంది.
ఫోకస్ పాయింట్: ఒక మంచి అటెంప్ట్
రేటింగ్: 2.5/5
గమనిక:- ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!







