బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ కలిసి నటించగా, ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘హైవాన్‌’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన ‘ఒప్పం’కు ఇది హిందీ రీమేక్‌. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ చిత్రాన్ని కూడా ప్రియదర్శనే తెరకెక్కించారు. తెలుగులో ‘కనుపాప’ పేరుతో వచ్చిన ఆ కథ మరోసారి కొత్త తారాగణంతో, కొత్త భాషలో ప్రేక్షకులను పలకరించింది.

కథ పరంగా చూస్తే.. శ్యామ్‌ రాణే (సైఫ్ అలీఖాన్‌) అంధుడు. చిన్ననాటి లోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ, మెయింటెనెన్స్‌ బాధ్యతలు చూసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. చూపు లేకపోయినా అతని గ్రహణశక్తి, జాగ్రత్తలు అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారందరికీ ఆధారంగా మారుతాయి. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మాజీ న్యాయమూర్తి ప్రధాన్‌ (బొమన్‌ ఇరానీ)తో శ్యామ్‌కు సన్నిహిత్యం పెరుగుతుంది. ఎవరికీ తెలియకుండా దూరంగా పెంచుతున్న తన కుమార్తె గురించి ప్రధాన్‌ శ్యామ్‌కు చెబుతాడు. ఆమెకు సంరక్షకుడిగా శ్యామ్‌ వ్యవహరించడం మొదలుపెడతాడు.

ఈ క్రమంలో ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా, ప్రధాన్‌ ఫ్లాట్‌లోకి చొరబడిన పరశురామ్‌ గోఖలే (అక్షయ్‌ కుమార్‌) అతడిని హత్య చేస్తాడు. అక్కడితో ఆగకుండా, రహస్యంగా పెంచుతున్న ప్రధాన్‌ కుమార్తెను కూడా చంపేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. పరశురామ్‌కు ప్రధాన్‌తో ఉన్న విరోధం ఏమిటి? అంధుడైన శ్యామ్‌ అతడిని ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో శ్యామ్‌ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనేదే కథ మిగతా భాగం.

కథను చదివిన వెంటనే మలయాళ ‘ఒప్పం’ గుర్తుకు రావడం సహజం. అదే కథను, అదే దర్శకుడు మరోసారి సైఫ్‌, అక్షయ్‌లతో హిందీలో తీర్చిదిద్దారు. 2016 సెప్టెంబరు 8న విడుదలైన ‘ఒప్పం’ ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత రీమేక్‌ రూపంలో రావడం విశేషం. అయితే ప్రస్తుత ఓటీటీ కాలంలో అందరికీ తెలిసిన కథను మళ్లీ తెరపైకి తీసుకురావడం ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న ‘హైవాన్‌’ చూసిన తర్వాత మరింత బలపడుతుంది.

ప్రథమార్ధంలో శ్యామ్‌ పాత్ర పరిచయం, అపార్ట్‌మెంట్‌ వాతావరణం, అక్కడి వ్యక్తులతో అతని అనుబంధం చూపడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. పరశురామ్‌ ఎంట్రీ వరకు కథ నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా మాతృక చిత్రాలు చూసిన వారికి ఈ భాగం బోరింగ్‌గా అనిపించే అవకాశం ఉంది. ప్రధాన్‌ హత్య, ఆ సమయంలో శ్యామ్‌తో జరిగే సంఘర్షణల తర్వాతే కథ గాడిలో పడుతుంది. అప్పటికే విరామం టైటిల్‌ పడుతుంది.

ద్వితీయార్ధం మాత్రం పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌, ప్రధాన్‌ కుమార్తె కోసం పరశురామ్‌ చేసే అన్వేషణ, వాటిని అడ్డుకునే శ్యామ్‌ ప్రయత్నాలతో థ్రిల్లింగ్‌ మోడ్‌లో సాగుతుంది. ‘కనుపాప’ లేదా ‘ఒప్పం’ చూడని వారికి ఈ భాగం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రియదర్శన్‌ తన శైలిలో కొంత కామెడీని కలపడానికి ప్రయత్నించారు. పోలీస్‌ విచారణ సన్నివేశాల్లో షబీర్‌ హష్మి వినోదం పంచి, సీరియస్‌ కథనానికి కొంతవరకు రిలీఫ్‌ ఇచ్చారు. క్లైమాక్స్‌లో శ్యామ్‌, పరశురామ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివర్లో మోహన్‌లాల్‌ తళుక్కున కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే.. అంధుడైన శ్యామ్‌ పాత్రలో సైఫ్ అలీఖాన్‌ నమ్మకంగా నటించారు. నడక, హావభావాలు, యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. ప్రతినాయకుడు పరశురామ్‌గా అక్షయ్‌ కుమార్‌ మాత్రం పూర్తిగా మెప్పించలేకపోయారు. ప్రతీకారం నుంచి వచ్చే కోపం, ఆవేదన ఆయన ముఖంలో అంతగా కనిపించలేదు. బొమన్‌ ఇరానీ, సయామీఖేర్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, షబీర్‌ హష్మి తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే సినిమాలో అనేక లోపాలు కనిపిస్తాయి. రీమేక్‌ చేస్తూ మాతృకలో ఉన్న బలహీనతలను సరిదిద్దడం, మరింత థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ జోడించడం బదులు, అనవసర పాటలు, సన్నివేశాలతో నిడివి పెంచిన భావన కలుగుతుంది. అందుకే ప్రియదర్శన్‌ రీమేక్‌ చేశారనడం కన్నా, కాపీ పేస్ట్‌ చేసినట్టే అనిపిస్తుంది.

మొత్తానికి ‘ఒప్పం’ లేదా ‘కనుపాప’ చూడని వారికి ‘హైవాన్‌’ ఓ మోస్తరు థ్రిల్లర్‌గా అనిపించవచ్చు. అయితే కథ తెలిసిన వారికి కొత్తదనం లేకపోవడం, నిడివి ఎక్కువగా అనిపించడం మైనస్‌గా మారే అవకాశముంది.

బలాలు: నటీనటుల నటన, ద్వితీయార్ధం థ్రిల్‌

బలహీనతలు: నెమ్మదిగా సాగే ప్రథమార్ధం, నిడివి, తెలిసిన కథే కావడం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

రేటింగ్:- 2/5