సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాంగ్ మెన్’ సినిమా ఈ వారం నిశ్శబ్దంగా ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లోరో ఫిలిం, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విహాన్ దర్శకత్వం వహించగా, అజయ్ మైసూర్ నిర్మాతగా వ్యవహరించారు. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని బ్రహ్మానందం వంటి ప్రముఖులు ప్రమోట్ చేసినప్పటికీ, విడుదలకు ముందు పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. జూలై 3, 2026న విడుదలైన ఈ సినిమా తలారి వ్యవస్థ నేపథ్యంగా సాగుతుంది.

కథ పరంగా చూస్తే, సన్నీ నవీన్ పోషించిన సన్నీ, శరణ్య శర్మ నటించిన జ్యోత్స్న ప్రేమించుకొని, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారు. ఎంగేజ్మెంట్ రోజు ఫ్రెండ్స్‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చి తిరుగు ప్రయాణంలో కాసేపు ఒంటరిగా గడపాలని నిర్ణయించుకుంటారు. అర్ధరాత్రి బస్టాండ్‌లో మాట్లాడుకుంటున్న సమయంలో వీరిని శివయ్య (బ్రహ్మాజీ) గమనిస్తూ ఉంటాడు. అతని చూపును జ్యోత్స్న తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఆటోలో శివయ్య ఎక్కుతున్నాడని భావించి జ్యోత్స్న ఎక్కకుండా, తర్వాత వచ్చిన బస్సులో సన్నీతో కలిసి ప్రయాణిస్తుంది. ఆ బస్సులో వీరితో పాటు నలుగురు యువకుల గ్యాంగ్ మాత్రమే ఉంటుంది. వారు సన్నీ, జ్యోత్స్నలను రెచ్చగొట్టి గొడవకు దింపి, సన్నీని దారుణంగా కొట్టి, జ్యోత్స్నపై అఘాయిత్యం చేసి హత్య చేస్తారు. ఈ నేరానికి గాను ఆ నలుగురికి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది.

జైల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఈ శిక్ష అమలుకు తలారి అయిన శివయ్యను రంగంలోకి దింపుతారు. జ్యోత్స్నను లైంగికంగా వేధించి చంపేశారని తెలుసుకున్న శివయ్య తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. ఎందుకంటే జ్యోత్స్న తన కూతురిలా కనిపించడం వల్ల, బస్టాండ్‌లో ఆమెను చూసినప్పటి నుంచే అతను ఆమెను గమనిస్తూ ఉంటాడు. జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేసిన ఆ నలుగురిని ఉరి తీసే ముందు, సమాజంలోని యువతకు గుణపాఠం చెప్పాలని శివయ్య తీసుకునే డేరింగ్ నిర్ణయం, దాని ప్రభావం అతని కొడుకు శంకర్ (సన్నీ పల్లె), భార్య గంగ (సురభి ప్రభావతి) జీవితాలపై ఎలా పడుతుంది అనేదే మిగతా కథ.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే, బ్రహ్మాజీ ఎలాంటి పాత్రనైనా సులభంగా ఒదిగిపోగలడు. ఈ చిత్రంలో ఆయన చాలా సెటిల్డ్‌గా నటించి, తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఎక్కడా కూడా అతని నటన అతిశయోక్తిగా అనిపించదు. లీడ్ పాత్రకు సరైన ఎంపికగా నిలిచాడు. సురభి ప్రభావతి తన పాత్రకు సరిపోయేలా నటించి, మరోసారి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా అనిపించింది. కొడుకు పాత్రలో సన్నీ పల్లె బాగానే సెట్ అయ్యాడు. వంశీధర్ గౌడ్ మినహా మిగతా నటులు ఎక్కువగా కొత్తవారే కావడంతో, వారి పాత్రలు అంతగా గుర్తుండిపోయేలా ఉండవు.

సాంకేతికంగా చూస్తే, తలారి వ్యవస్థ గురించి చాలా మందికి, ముఖ్యంగా జెన్-జి తరానికి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఓ కథను చెప్పాలనుకున్న దర్శకుడు విహాన్ ప్రయత్నం ప్రత్యేకంగా నిలుస్తుంది. తలారులను కాటికాపరులతో పోల్చుకునే సామాన్య అభిప్రాయానికి భిన్నంగా, వారి ఆలోచనా విధానం, ఒకరిని ఉరి తీసిన తర్వాత వారి మానసిక స్థితి, ఉన్నతాధికారులు వారిని ఎలా తక్కువ చేసి చూస్తారు వంటి అంశాలను దర్శకుడు క్లుప్తంగా చూపించాడు. ఒక్కో ఉరికి తలారికి కేవలం రూ.25 మాత్రమే ఇచ్చే వ్యవస్థను చూపించడం ద్వారా ఈ కథ కోసం చేసిన రీసెర్చ్ స్థాయి అర్థమవుతుంది.

మనుషులను చంపడం తప్ప బాధపెట్టడం అనేది మా పనికాదు

అనే డైలాగ్‌ను బ్రహ్మాజీ పాత్ర ద్వారా చెప్పించిన సందర్భంలో ఉన్న లోతు చిత్రానికి బలం చేకూరుస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం కూడా బాగుంది. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా సరైన క్యాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో దర్శకుడి టాలెంట్ పూర్తిగా బయటపడలేదని చెప్పాలి. ఈ కథను ఇంకాస్త మంచి ఇమేజ్ ఉన్న నటీనటులతో, మెరుగైన నిర్మాణ విలువలతో తీసి ఉంటే, సినిమా రీచ్ మరింత పెరిగేదని భావించవచ్చు.

సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. సినిమా నిడివి గంటన్నర లోపే ఉండటం మాత్రం ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. మొత్తంగా ‘హ్యాంగ్ మెన్’ ద్వారా తలారి వ్యవస్థను ఈ తరానికి పరిచయం చేయాలన్న హానెస్ట్ ప్రయత్నం కనిపిస్తుంది. కానీ మెరుగైన క్యాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే నిలిచింది.

రేటింగ్: 2.5/5