రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రివ్యూ ‘హనుమాన్ అంశ్’ఆధ్యాత్మిక పరిమళాలతో మెప్పిస్తున్న
చిత్రం: హనుమాన్ అంశ్; నటీనటులు: శోభినవ్ సత్య, రాజీవ్ మిశ్రా, చందన్ ఆనంద్, విహాన్ షెడ్గే, పూర్ణిమ తివారి, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు; సంగీతం: సాధు సుశీల్ తివారీ; సినిమాటోగ్రఫీ: విశాల్ బవా; రచన, దర్శకత్వం: విశాల్ చతుర్వేది; నిర్మాతలు: రాగిణి సోనా, నమ్రతా జి సింగ్, అనుప్రియ ఎ నగర్, విశాల్ చతుర్వేది; విడుదల తేదీ: 09-10-2026.
ఎలాంటి అంచనాల్లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. దాదాపు రెండు కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు కాలంలో సాగే ఈ కథలో లక్ష్మీ నారాయణ శర్మ (శోభినవ్ సత్య) 13 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోతాడు. చనిపోయిన తల్లిని తిరిగి చేరుకోవాలనే తపనతో, శ్రీరాముడు మాత్రమే తమను కలుపగలడని నమ్మి, తల్లి నేర్పించిన ధ్యాన సాధన ఆధారంగా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభిస్తాడు. హనుమాన్ చాలీసా స్ఫూర్తితో హనుమంతుడి ద్వారా రాముడిని చేరుకోవచ్చని విశ్వసించి, ఆ దిశగా తన ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగుతుంది.
ఈ ప్రయాణంలో లక్ష్మీ నారాయణ ఎదుర్కొన్న మలుపులు, అడ్డంకులను అధిగమిస్తూ, నిస్వార్థ ప్రేమతో సమాజానికి సేవ చేస్తూ నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు? ఈ క్రమంలో ఆయన చేసిన అద్భుతాలు ఏమిటి? అన్నదే చిత్రానికి మూలకథ. 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా (మహారాజ్‌జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
దర్శకుడు విశాల్ చతుర్వేది రెగ్యులర్ కమర్షియల్ హంగులకు దూరంగా, ఆద్యంతం స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా కథను తెరపై సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నాస్తికుడైన డాక్టర్ రామానంద్ భోంస్లే దృక్కోణం నుంచి కథను ప్రారంభించిన తీరు, బాబా బాల్యాన్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటాయి.
తల్లి మరణం తర్వాత బాలుడు సాగించిన ఆధ్యాత్మిక అన్వేషణ, ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను మనసుకు హత్తుకునేలా చూపించారు. రాజ్‌కోట్‌లోని వైష్ణవ ఆలయంలో పరిచయమయ్యే వృద్ధ మహంత్ పాత్ర లక్ష్మీ నారాయణ ఆధ్యాత్మిక జీవితాన్ని కీలకంగా మలుపు తిప్పుతుంది. మహంత్ పెట్టిన పరీక్షను బాలుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నీమ్ కరోలిలో అడుగు పెట్టిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే భూగర్భ గుహ సన్నివేశాలు, విష సర్పాల మధ్య శివుడిలా బాబా దర్శనమిచ్చే దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ద్వితీయార్ధంలో నీమ్ కరోలి బాబా చేసిన లీలలు, ఆయన ఆధ్యాత్మిక సాధన, సమాజ సేవ చుట్టూ కథనం తిరుగుతుంది. అయితే ప్రథమార్ధంతో పోలిస్తే ఈ భాగం నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. రైలులో బ్రిటిష్ అధికారి అహంకార ధోరణి, దానికి బాబా భక్తి మార్గంలో తనదైన శైలిలో బుద్ధి చెప్పే సన్నివేశం సెకండాఫ్‌కు మంచి విజిల్ మూమెంట్‌గా నిలుస్తుంది. పార్వతి భర్తను పాము కాటు నుంచి తప్పించే దృశ్యం, ఆమె ఇంట్లో బాబా భోజనం చేసే సన్నివేశాల్లో భావోద్వేగాలు బలంగా పండాయి.
బాబా వైవాహిక జీవితంలోకి వెళ్లాల్సి రావడం, భార్యకు తన అసలు లక్ష్యాన్ని తెలియజేసి కుటుంబ బంధాల నుంచి బయటకొచ్చే తీరు కూడా ఆకట్టుకుంటుంది. కథకు కొనసాగింపు ఉందన్న సంకేతం ఇస్తూనే, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ముగించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.
నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య సహజంగా ఒదిగిపోయారు. నటుడిగా తొలి చిత్రం అయినప్పటికీ, పరిపక్వతతో కూడిన అభినయంతో ఎక్కడా కొత్తవాడనే భావన రానీయలేదు. నాటకీయత లేకుండా ప్రశాంతమైన చిరునవ్వు, స్వచ్ఛమైన హావభావాలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. స్వాతంత్య్ర వీరుడు, నాస్తిక డాక్టర్‌గా చందన్ ఆనంద్ నటన ప్రభావవంతంగా ఉంది. విహాన్ షెడ్గే, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు తమ తమ పాత్రల్లో సహజంగా నటించారు.
దర్శకుడు విశాల్ చతుర్వేది నీమ్ కరోలి బాబా జీవితాన్ని నిజాయితీతో తెరపై ఆవిష్కరించారు. బాబా లీలలను అతిశయోక్తి దూరంగా, వాస్తవికతకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. సాధు సుశీల్ పాటలు, నేపథ్య సంగీతం భక్తిభావాన్ని మరింత పెంచాయి. ఆద్యంతం ‘సీతారామ్’ నామస్మరణ థియేటర్‌లో మార్మోగేలా మ్యూజిక్ డిజైన్ చేశారు. పరిమిత బడ్జెట్ ఉన్నప్పటికీ స్వాతంత్య్ర పూర్వ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ విభాగాలు మెప్పించాయి.
బలాలు: ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళించే కథ, శోభినవ్ సత్య నటన, సంగీతం. బలహీనతలు: నెమ్మదిగా సాగే కథనం.
మొత్తానికి ‘హనుమాన్ అంశ్’ మనసుకు ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక ప్రయాణంగా నిలిచే చిత్రంగా సమీక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత దృష్టికోణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.
రేటింగ్:- 2.75/5







