రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: చిత్రం: ఇరుముడి; నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు; సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ; నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్; దర్శకత్వం: శివ నిర్వాణ; విడుదల: 21-08-2026.
మాస్ సినిమాలకు పెట్టింది పేరు రవితేజ. ఆయనను సహజమైన కథలో చూసి చాలా కాలమైంది. ఇటీవల వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా ఆయన శైలికి తగ్గ వాణిజ్యాంశాలే ఎక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయి విజయాలు రాలేదు. ఈసారి శివ నిర్వాణతో కలిసి చేసిన ‘ఇరుముడి’లో మాత్రం రవితేజ కొత్త తరహా పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం ఆయన గత సినిమాలకంటే భిన్నంగా ఉందా? ఏం చెప్పింది అనేదే ఇప్పుడు చూద్దాం.
కథా సారాంశం
సీలేరు సమీపంలోని పొల్లూరు అనే మారుమూల గ్రామంలో అరటి సాగు చేసే సాధారణ రైతు త్రినాథ్ (రవితేజ) జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. మద్యం అలవాటు ఉన్నప్పటికీ అయ్యప్పస్వామిపై అతనికి అపారమైన భక్తి. ప్రతి ఏడాది మాల ధారణ చేసి పవిత్రంగా దీక్ష చేస్తుంటాడు. ఈ దీక్ష అంతా తన ప్రాణం కంటే ప్రియమైన కూతురు కోసమే.
కావేరి (ప్రియా భవానీ శంకర్)తో పెళ్లి తర్వాత నాలుగేళ్లకు పుట్టిన కూతురికి మణికంఠ (నక్షత్ర) అని పేరు పెట్టుకుంటాడు. కూతురు ఐదో తరగతి పాస్ అయ్యిందని గ్రామం మొత్తం భోజనాలు పెట్టి సంబరాలు చేసుకుంటాడు. ఎవ్వరినీ భయపడని త్రినాథ్, తన కూతురినీ అదే ధైర్యంతో పెంచుతాడు. చుట్టుపక్కల ఏం జరిగినా, ఏం చూసినా భయపడకుండా నాన్నకు చెప్పాలని నేర్పుతాడు. తండ్రి చెప్పినట్టుగానే ప్రతి విషయాన్ని చెవిలో వేస్తూ ఉంటుంది మణికంఠ.
త్రినాథ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత, తాను చదువుతున్న స్కూల్‌లో జరుగుతున్న ఓ సంఘటన గురించి మణికంఠకు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎలాగైనా నాన్నకు చెప్పాలని ఆమె ప్రయత్నిస్తుంది. అంతలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. మణి చెప్పాలనుకున్న విషయం ఏమిటి? త్రినాథ్‌కు తెలియకుండా ఊళ్లో, స్కూల్లో జరుగుతున్న సంఘటనలు ఏంటి? వాటి గురించి అతనికి ఎప్పుడు, ఎలా తెలుస్తుంది? తెలిసేలోపు ఏం జరుగుతుంది? అన్నదే మిగతా కథ.
నిర్మాణం, కథన శైలి
కథను బట్టి చూస్తే ఇది తండ్రీ–కూతుళ్ల బంధం చుట్టూ అల్లుకున్న సినిమా అని అనిపించినా, ఆ అంశానికి మాత్రమే పరిమితం కాదు. థ్రిల్ పంచే నేర నేపథ్యం, బలమైన సామాజికాంశాల మేళవింపు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అయ్యప్ప మాల, భక్తి నేపథ్యం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
తెలుగు అగ్ర హీరోల సినిమాల్లో కథతో సంబంధం లేని హీరోయిజం, వాణిజ్య హంగామా ఎక్కువగా కనిపించే పరిస్థితిలో, ‘ఇరుముడి’ మాత్రం పూర్తి భిన్నంగా, కథకు తగ్గ భావోద్వేగాలతో నిజాయతీగా రూపొందింది. సరికొత్త నేపథ్యం, అర్థవంతమైన పాత్రలు, బలమైన రచన కారణంగా ప్రేక్షకుడిపై గాఢమైన ప్రభావం చూపుతుంది. అన్నీ సరిగ్గా కుదరడంతో భావోద్వేగాలు బలంగా పండాయి. సినిమాకి కీలకమైన థ్రిల్లింగ్ అంశాలు కూడా ప్రభావం చూపించాయి.
ఆరంభ సన్నివేశాలు సాధారణంగా అనిపించినా, కథానాయకుడు మాల ధారణ చేసే దశ నుంచి సినిమా కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. తండ్రీ–కూతుళ్ల బంధం చుట్టూ అల్లిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రతి ఆడపిల్లను తన కూతురుగా భావించే త్రినాథ్, ఏం జరిగినా తండ్రికి చెప్పే మణికంఠ పాత్రల రూపకల్పన బలంగా నిలిచింది.
కథానాయకుడికి పెరిగే శత్రువులు, ఊరి పక్కన అడవిలో సంచరించే ప్రమాదకర ముఠా, అమ్మాయిల అనుమానాస్పద మరణాలు, స్కూల్‌లో జరిగే పరిణామాలు కథలో ఉత్కంఠను పెంచుతూ వెళ్తాయి. అయితే ఊళ్లో, ఊరి చుట్టూ ఇంత జరుగుతున్నా పోలీసుల పాత్రను పూర్తిగా పక్కన పెట్టి కథ నడిపించడం దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా వినియోగించినట్టుగా అనిపిస్తుంది.
ద్వితీయార్ధంలో అనూహ్య మలుపులతో థ్రిల్లింగ్‌గా సాగే కథనం, పతాక సన్నివేశాల్లో పండిన గాఢమైన భావోద్వేగాలు అప్పటివరకు కనిపించిన లోటుపాట్లన్నింటినీ మరిచిపోయేలా చేస్తాయి. సాధారణంగా ప్రతినాయకుడి అంతం తర్వాత ప్రేక్షకులు లేచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ, ఈ సినిమాలో మాత్రం చివరి వరకూ సీట్లో కూర్చోబెట్టేంతగా భావోద్వేగాలు పండాయి. ఇటీవల యువ దర్శకులు ఆడపిల్లల పెంపకం, వారి పరిరక్షణలో కుటుంబం, సమాజం బాధ్యతను గుర్తుచేసే కథలతో సినిమాలు చేయడం మంచి పరిణామం. ‘ఇరుముడి’ కూడా అదే దిశలో సాగింది. ఆడపిల్లలను భయంతో కాకుండా ధైర్యంగా పెంచాలన్న అంశాన్ని నేటి సమాజానికి అవసరమైన సందేశంగా దర్శకుడు ప్రభావవంతంగా చూపించాడు.
నటీనటుల నటన
రవితేజ అంటే మాస్ పాత్రలే గుర్తొచ్చే పరిస్థితి. ఈ సినిమాలో కూడా ఆయన శైలి మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అవి నేల విడిచి సాము చేస్తున్నట్టు అనిపించవు. సహజమైన పాత్రలో ఆయన ఒదిగిపోతే ప్రభావం ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. భావోద్వేగాలను అవలీలగా పండించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఆయన నటన హైలైట్. సాయికుమార్‌తో కలిసి చేసిన ప్రీ క్లైమాక్స్, ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ సన్నివేశాల్లో మరింత కదిలిస్తాడు.
త్రినాథ్ భార్య కావేరి పాత్రలో ప్రియా భవానీ శంకర్ సహజంగా కనిపించింది. మణికంఠ పాత్రలో బేబీ నక్షత్ర తన నటనతో కట్టిపడేసింది. రవితేజ–నక్షత్ర మధ్య సన్నివేశాలే సినిమాకి బలం. సాయికుమార్, శ్వాసిక, అజయ్ ఘోష్, ఎమ్మెల్యే పాత్రలో నటించిన రమేశ్ ఇందిర పాత్రలు కథలో కీలకంగా నిలిచాయి. ఆ పాత్రల రూపకల్పన, అందులో వారి నటన బాగుంది.
సాంకేతిక విభాగం
జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం సినిమాకి పెద్ద ప్లస్. అయ్యప్ప మాల నేపథ్యంతో సాగే మూడు పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘యాలాలో...’ పాటతో పాటు, పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పాట భావోద్వేగాల మోతాదును మరింత పెంచాయి. నేపథ్య సంగీతం ఉత్కంఠ, భావోద్వేగాలను బలంగా మోసింది.
విష్ణు విజువల్స్ సినిమాకి మరో బలం. సీలేరు ప్రాంతాన్ని చూపించిన తీరు, థ్రిల్ పంచే సన్నివేశాల్లో లైటింగ్ కట్టిపడేస్తుంది. కొన్ని చోట్ల తర్కానికి అందని విధంగా అనిపించినప్పటికీ, దర్శకుడు శివ నిర్వాణ రచనే సినిమాకి ప్రధాన బలం.
రేటింగ్ 3.5/5 మాస్ మహారాజ బ్లాక్ బస్టర్ కొట్టిండు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే






